ఆడపిల్ల పుట్టిన ప్రాంతమే.. ఆమె భవిష్యత్తును నిర్ణయిస్తుందా?

ఆడపిల్ల పుట్టినప్పుడు.. ఆ బాలిక పట్ల చూపే వైఖరి ఆమె జీవితాంతం.. ఆమె కెరీర్ మీద, ఆర్థిక పరిస్థితుల మీద ప్రభావం చూపుతుందని సరికొత్త అధ్యయనం చెప్తోంది.

అమెరికాలో లింగవివక్ష ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పుట్టిన మహిళలు.. ఇతర ప్రాంతాల్లో పుట్టిన మహిళల కన్నా తక్కువ ఆదాయం ఆర్జిస్తున్నారని ఆ అధ్యయనంలో వెల్లడైంది.

ఆ బాలికలు పెద్దయ్యాక లింగ వివక్ష తక్కువగా ఉన్న ప్రాంతాలకు నివాసం మారినా కూడా.. ఆమె ఆలోచనా విధానంపై చూపిన ప్రభావం కారణంగా ఈ తేడా అలాగే కొనసాగుతుంది.

యూనివర్సటీ ఆఫ్ చికాగోకు చెందిన కెర్విన్ కోఫీ, నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన జొనాథన్ గుర్యాన్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కి చెందిన జెస్సికా పాన్‌ అనే ఆర్థికవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు.

ఒక మహిళ పుట్టిన ప్రాంతం.. ఆ మహిళ పనిచేసే ప్రాంతాల ప్రభావం ఆమె ఉద్యోగం మీద, వేతనం మీద ఎలా ప్రభావం చూపుతున్నాయనే అంశం మీద ఈ పరిశోధన దృష్టి కేంద్రీకరించింది.

అమెరికాలోని దక్షిణ ప్రాంతంలో పుట్టిన ఒక మహిళ.. పసిఫిక్ తీర ప్రాంతంలో పుట్టిన ఒక మహిళ మధ్య ఉద్యోగం, వేతన వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుందని.. వారిద్దరూ పెద్దయ్యాక న్యూయార్క్ వచ్చి స్థిరపడినా ఆ తేడా కొనసాగుతుందని ఈ అధ్యయనంలో గుర్తించారు.

అయితే.. కేవలం లింగ వివక్ష మీదే తమ అధ్యయనాన్ని కేంద్రీకరించటానికి ఈ పరిశోధనను శ్వేతజాతి మహిళల మీదే చేపట్టారు.

లింగ వివక్ష అధికంగా ఉన్న ప్రాంతాల్లో పుట్టిన మహిళలకు.. ఇతర ప్రాంతాల్లో పుట్టిన మహిళలకన్నా త్వరగా పెళ్లిళ్లు జరిగి, పిల్లలు పుడుతున్నారని కూడా ఈ అధ్యయనంలో గుర్తించారు.

మహిళలు ఇంటికి, పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించే స్త్రీల మధ్య ఉండే యువతులు త్వరగా పెళ్లి చేసుకుని, పిల్లలను కంటున్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది.

అలాగే.. మొదటి బిడ్డ పుట్టిన తర్వాత మహిళల ఉపాధి గణనీయంగా పడిపోతోంది. అంతేకాదు.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి ఆలోచనలు కూడా చుట్టూ ఉన్న ఆలోచనలకు అనుగుణంగా సంప్రదాయబద్ధంగా మారుతున్నాయి.

మహిళలు తాము పుట్టిపెరిగిన సమాజంలోని ఆలోచనా విధానాలను తమలో ఇముడ్చుకోవటం.. ఈ తేడాలు కొనసాగటానికి కారణమని పరిశోధకులు చెప్తున్నారు.

మగవాళ్లు చేసే పనులు, ఆడవాళ్లు చేసే పనులు అనే తేడాలు సహజమైనవిగా అంగీకరించటం వల్ల ఈ మహిళలు పదోన్నతులు, వేతనాల పెంపు విషయంలో డిమాండ్ చేయటానికి సంసిద్ధంగా ఉండలేకపోతున్నారని విశ్లేషిస్తున్నారు.

మహిళలు బయటకు వెళ్లి పనిచేయటాన్ని వ్యతిరేకించే, లేదా మహిళ ప్రధాన పాత్ర ఇంట్లో తల్లిగానే ఉండాలని భావించే సంస్కృతి తమలోనూ అంతర్లీనంగా పాతుకుపోవటం వల్ల కూడా ఆ మహిళలు వేతన వ్యత్యాసం గురించి, పనిలో ఎదుగుదల గురించి పెద్దగా ఆసక్తి చూపటం లేదని చెప్తున్నారు.

అలాగే.. మహిళలు పెద్యయ్యాక నివసించే, పని చేస్తున్న ప్రాంతంలో లింగవివక్ష ఎలా ఉంటుందనేది కూడా మహిళల కెరీర్ మీద ప్రభావం చూపుతుందని ఈ పరిశోధనలో గుర్తించారు.

లింగవివక్ష అధికంగా ఉండే ప్రాంతాల్లో మహిళలు ఉద్యోగ రీత్యా పై స్థాయిలో ఉన్నా కూడా.. వారికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వటం వంటివి జరుగుతున్నట్లు గుర్తించారు.

అంతేకాదు.. తమ చుట్టూ ఉన్న మహిళల అభిప్రాయాలు కూడా ఇతర మహిళలపై ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు.

మహిళలు ఇంటికి, పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించే స్త్రీల మధ్య ఉండే యువతులు త్వరగా పెళ్లి చేసుకుని, పిల్లలను కంటున్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది.

అయితే.. ఈ విషయంలో తమ చుట్టూ ఉండే పురుషుల అభిప్రాయాలు మహిళలపై పెద్దగా ప్రభావం చూపకపోవటం విశేషం.

కానీ.. తమ చుట్టూ ఉండే పురుషుల్లో లింగ వివక్ష ఎంత ఎక్కువగా ఉంటే.. మహిళలు పని చేయటం, ఆదాయం ఆర్జించటం అంత తక్కువగా ఉంటుందని ఆ అధ్యయనం చెప్తోంది.

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe