Sri Lanka: వలసపోతున్న వైద్యులు, పరిహారం కోరుతున్న ప్రెసిడెంట్

రెండేళ్ల క్రితం శ్రీలంకను ఆర్థిక సంక్షోభం కుదిపేసింది. తినడానికి తిండి దొరక్క ఆ దేశ వాసులు అల్లాడిపోయారు.

ఉల్లిపాయలు కిలో రూ. 250, బియ్యం కిలో రూ. 200 పాలపొడి రూ. 1345కి ఇలా నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్నంటాయి.

గ్యాస్‌, పెట్రోలు కోసం రోజుల తరబడి క్యూలో వేచి ఉన్నారు.

Sri Lanka లో బతకలేమని అనేక మంది సామాన్యులు సముద్రమార్గంలో శరణార్థులుగా భారత్‌కు చేరుకున్నారు.

sri lanka economic crisis

ఆ భయంకర ఆర్థిక  సంకోభం నుంచి ఇంకా పూర్తిగా గట్టెక్కకుండానే మరో సంక్షోభం శ్రీలంకను వెంటాడుతోంది.

ఇతర సమస్యలు ఎన్ని ఉన్నా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా శ్రీలంకలో ఆరోగ్య వ్యవస్థకు మంచి పేరుంది. ఆరోగ్య రంగానికి ఆ దేశం ప్రాధాన్యత ఇచ్చింది.

ప్రభుత్వ రంగంలోనే నూటికి 95 శాతం మంది అక్కడ సేవలు పొందేవారు. ఆ వ్యవస్థ నేడు కుప్పకూలే స్థితిలో ఉంది.

ఇప్పుడు వైద్యం కోసం జనం రోజుల తరబడి వేచి ఉంటున్నారు. ప్రభుత్వ ఆరోగ్య రంగంలో ఉచిత సేవలు అందకపోవడంతో.. కొంతమంది వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు రంగాన్ని ఆశ్రయిస్తున్నారు.

ప్రైవేటు సేవలు పొందలేక సామాన్యులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు.

విదేశాలకు Sri Lanka వైద్యుల వలసలు

‘మధుమేహం వల్ల నా కాలికి పుండైంది.. నెలవారీ చెకప్‌ కోసం ఆస్పత్రికి వచ్చా.. డాక్టర్‌ను కలవడానికి ఆరు గంటలుగా ఎదురుచూస్తున్నా.. అని 47 ఏళ్ల శ్రీలంక వాసి శ్రీమల్‌ నలక చెప్పారు.

ఆయన మాటలు తాజా పరిస్థితికి అద్ధం పడుతున్నాయి.

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో గత రెండేళ్లలో శ్రీలంక నుంచి డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు సుమారు 1700 మంది దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్లారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

2021లో 200 మంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారు. 22 మిలియన్ల జనాభా ఉన్న ద్వీపదేశంలో ఈ వలసలు ఆరోగ్య సంక్షోభానికి దారి తీయనున్నాయి.

ఇంకా ముదరనున్న సంక్షోభం

ఓ వైపు ఈ వలసలు కొనసాగుతుండగానే జూన్ 2022 నుంచి జూలై 2023 మధ్య మెడికల్ కౌన్సిల్ నుండి 4,284 మంది వైద్యులు తమ ప్రతిభను నిరూపించే సర్టిఫికెట్లను (Good Standing certificates) పొందారు.

విదేశాలలో స్థిరపడాలనుకునేవారికి వృత్తిపరమైన ఈ తరహా సర్టిఫికెట్లు తప్పని సరి.

అంతే కాదు.. బ్రిటన్, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్యంలోని దేశాల నుండి 5,000 కంటే ఎక్కువ మంది వైద్యులు మెడికల్ లైసెన్స్‌లను పొందారని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది.

ఈ ఏడాది, 2025లో విదేశీ లైసెన్సింగ్ పరీక్షల కోసం వేలాది మంది స్లాట్‌లను రిజర్వ్ చేసుకున్నారు. ఈ సంఖ్యలను బట్టి విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య భారీగా ఉన్నట్టు వెల్లడవుతోంది.

ఈ సంక్షోభ నివారణకు Sri Lanka ప్రభుత్వం కొన్ని చర్యలను చేపట్టింది.

Sri Lanka President Ranil Wickremesinghe

‘విదేశాలను నష్టపరిహారం కోరాలి’

శ్రీలంక వైద్యులను రిక్రూట్ చేసుకుంటున్న దేశాల నుంచి నష్టపరిహారం కోరాలని అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రభుత్వానికి సూచించారు.

ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద ఈ అంశాన్ని లేవనెత్తాలని ఆయన పేర్కొన్నారు.

వలసల కారణంగా ఏర్పడిన సిబ్బంది కొరతను అధిగమించేందుకు వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయస్సును (Retirement age) 65 నుంచి 60కి తగ్గిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సైతం విక్రమసింఘే (Wickremesinghe) ఉపసంహరించారు.

డాక్టర్లుకు ఇచ్చే అలవెన్సులను డబుల్‌ చేశారు. అయితే ఇవన్నీ నామమాత్రపు చర్యలుగానే పై లెక్కలను బట్టి అర్థమవుతోంది.

పేద దేశాల నుంచి వైద్యుల వలసలు

అయితే ఈ తరహా సంక్షోభాలు కేవలం శ్రీలంకకే పరిమితం కాలేదు. ఆఫ్రికన్ దేశాల్లో ముఖ్యంగా నైజీరియా, జింబాబ్వేల నుంచి ఈ వలసలు ఎక్కువగా ఉంటాయి.

తక్కువ జీతాలు, పని పరిస్థితులు కష్టంగా ఉండడం తదితర కారణాలతో ప్రతిభావంతులైన, మెరుగైన శిక్షణ పొందిన వైద్య నిపుణులు, నర్సులు ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిపోతుంటారు.

ఆరోగ్య సిబ్బందిని విదేశాల్లో రిక్రూట్‌ చేయడం నేరంగా పరిగణించాలని జింబాబ్వే వైస్ ప్రెసిడెంట్ కాన్‌స్టాంటినో చివెంగా (Constantino Chiwenga) కోరారు.

ధనిక దేశాలకు ఉపయోగపడుతున్న ఆరోగ్య కార్యకర్తల శిక్షణ కోసం దేశంలో ఎక్కువ మొత్తం ఖర్చు చేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.

sri lanka crisis

భవిష్యత్తు తరాలపై ప్రభావం

నైపుణ్యం కల్గిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు విదేశాలకు వెళ్లడం వల్ల ప్రస్తుతం సమాజానికే కాదు.. భవిష్యత్తు తరాలపైనా ఈ ప్రభావం పడనుంది.

నిపుణులు లేకపోవడంతో ప్రస్తుతం, భవిష్యత్తులో వైద్యవిద్యను అభ్యసించే వారికి సరైన మార్గదర్శకత్వం ఉండదు. ఇప్పటికే శిక్షణ సంస్థల్లో చాలా మంది నిపుణుల కొరతతో ఖాళీలు ఏర్పడినట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఆయా కోర్సుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీని ప్రభావం రానున్న తరాలపై పడనుంది. నిపుణుల కొరత ఆ దేశాన్ని వెంటాడనుంది.

“ఆర్థిక సంక్షోభం మనందరినీ తాకింది, కానీ మనలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది” అని చిన్న కిరాణా దుకాణం నడుపుతున్న నలక పేర్కొన్నారు.

మా వైద్యులను దేశంలోనే ఉంచే పరిష్కారాలు ఇప్పుడు మాకు కావాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు.

ఇది నలక ఒక్కడి అభిప్రాయమే కాదు.. శ్రీలంకలోని సామాన్యులందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు.

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe