జగన్ కేబినెట్: వైసీపీలో అసంతృప్తికి 151 కారణాలు

అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. మన నిత్య జీవితంతో ముడిపడి ఉండే అనేక విషయాలకు ఈ మాట వర్తించినా రాజకీయాలకు మాత్రం ఎన్నడూ స్థూలంగా వర్తించిన దాఖలాలు లేవు.

యోయో ఎరాలో ఈ బుక్కిష్ లాంగ్వేజ్ ఏంటి మామాబ్రో అనుకోవద్దు. అసలు విషయానికొచ్చేస్తున్నా. నాల్రోజుల కిందట ఏపీలో సీఎం జగన్మోహనరెడ్డి తన కేబినెట్‌లో మార్పులు చేశారు తెలుసు కదా.

తెలిసినా తెలియకపోయినా ఆ మ్యాటరే మాట్లాడుకుందాం ఇప్పుడు. పాతిక మంది పాత మినిష్టర్లను తీసేసి అందులో 11 మందిని మళ్లీ తీసుకుని కొత్తగా మరో 15 మందికి జగన్ కేబినెట్‌ లో చాన్సిచ్చారు.

అదిగో… తంటా అక్కడే మొదలైంది. ..తోటి కోడలు నవ్వినందుకు అన్నట్లుగా కొందరు తీసేసిన మినిష్టర్లు తెగ హర్టయ్యారు.

రీజనేంటీ అంటే.. తమలాగే తీసేసినా మళ్లీ 11 మందికి పోస్టింగిచ్చేశారు జగనన్న. కానీ, వీళ్లకు మాత్రం ఇయ్యలే. అందుకే అసంతృప్తి.. అలక, ఆవేశం, ఆవేదన, ఆగ్రహం.. ఒకటీ అరా ఉత్తుత్తి రాజీనామాలు.

బొడ్డుతాడు కోయని జిల్లాల పేర్లతో

సరే… పాత వాళ్లు పాతిక మందిలో 11 మంది పోను 14 మందికే కదా అసంతృప్తి అనుకుందామా అంటే అలా కూడా లేదు కదా.

జగన్ కేబినెట్‌లో కొత్తగా చాన్సొచ్చిన 15 మందిని చూసి రగిలిపోతున్నవాళ్లు మరో 15-20 మంది. అందులో కింక పెట్టేస్తున్న బ్యాచ్ కూడా పెద్దదే.

ఈ కింకను ఇంకా రెచ్చగొట్టేలా మీడియాలో కథలూ కథనాలూ.

ఇంకా బొడ్డుతాడు కూడా కోయని జిల్లాలు పేర్లు చెప్పి ఆ జిల్లాల్లో ప్రాతినిధ్యం లేదంటూ అనాల్సిస్సులూ.

అబ్బబ్బా…. జగనన్నకు పెద్ద చిక్కే వచ్చి పడిందే.

అటు తిప్పి ఇటు తిప్పి అనేకానేక అనాల్సిస్సులు చేసే పేపర్లు, టీవీలు, యూట్యూబ్ చానళ్లు ఒక్క విషయం మాత్రం చెప్పలేదు.

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జగన్‌కు ఇన్ని ఇబ్బందులు రావడానికి కారణం మాత్రం చెప్పలేకపోయాయి.

జగన్ కేబినెట్

అసలు కారణం ఇదీ…

అసలు కారణం… 2019 ఎన్నికల్లో 151 సీట్ల భారీ మెజార్టీ రావడమే.

అవును…. 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో 88 సీట్లొస్తే గవర్నమెంటు ఫార్మ్ చేయొచ్చు. 100 సీట్లొస్తే కావాల్సిన కంటే ఎక్కువ మెజారిటీ. 125 సీట్లొస్తే బ్రహ్మాండమైన మెజారిటీ.

కానీ, జగన్ పార్టీకి 151 సీట్లొచ్చాయి.

మరి లెక్క ప్రకారం 26 మందికి మించి మంత్రి పదవులు ఇవ్వడానికి వీల్లేదు.

అందుకే తెలివిగా ఆలోచించి రెండున్నర సంవత్సరాలకు మంత్రులను తొలగించి కొత్తగా మరో 26 మందికి ఇవ్వాలని జగన్ ప్లాన్ చేసుకున్నారు.

తొలుత 26 మందితో జగన్ కేబినెట్ ఏర్పాటు చేసుకున్నారు.. అప్పుడు కొందరు సీనియర్లు, ముఖ్యులు మంత్రి పదవులు పొందలేకపోయినా సరే… రెండున్నరేళ్ల తరువాత తమకు చాన్సొస్తుందిలే అనుకున్నారు.

ఆలోగా రాజకీయ వేడిలో శాసనమండలిని రద్దు చేయాలని ప్రయత్నించి.. అందులో సభ్యులై ఉండి మంత్రులుగా ఉన్న ఇద్దరిని రాజ్యసభకు పంపి అలా ఖాళీ అయిన స్థానాలకు మరో ఇద్దరితో నింపారు జగన్.

దాంతో మొన్నటి విస్తరణకు ముందు వరకు 28 మందికి మంత్రి పదవులు ఇచ్చినట్లయింది.

ఇప్పుడు పునర్వ్యవస్థీకరణలో కొత్తగా 15 మందికి చాన్సిచ్చారు జగన్.

అయినా తారా స్థాయిలో అసంతృప్తి

ఈ లెక్కన ఇప్పటివరకు 43 మందికి మంత్రి పదవులు ఇచ్చినట్లయింది. చెప్పాలంటే ఏపీలాంటి రాష్ట్రంలో ఇది పెద్ద సంఖ్యే. అయినా, వైసీపీలో అసంతృప్తి మాత్రం తారా స్థాయిలో ఉంది.

కారణం.. సీనియారిటీ, సమర్థత, రాజకీయ ప్రాధాన్యం, ప్రాబల్యం లాంటి లెక్కలతో సంబంధం లేకుండా పర్సనల్ ప్రయారిటీలు, ప్రత్యర్థి నేతలపై పగ సాధింపు లెక్కలతో పదవులివ్వడమే.

అన్నిటికీ మించి మెజారిటీ అవసరాలకు మించి 151 సీట్లు రావడం వల్లా ఈ సమస్య తలెత్తింది.

సాధారణంగా 100 మంది ఎమ్మెల్యేలుంటే అందులో కొత్తవారు, సత్తాలేని వారు, నోరెత్తలేనివారు… ఇలా సగం మంది ఉంటారు. కానీ, వైసీపీ లెక్క 151… దాంతో అందులో సగం 75 మందిని తీసేసినా మిగతా 75 మందిలో ఆశలు ఉంటాయి.

కానీ చాన్సొచ్చింది 43 మందికే… మిగతా 32 మందికీ అసంతృప్తే.

అందుకే…. అతి సర్వత్రే వర్జయేత్ అన్నారేమో పెద్దలు.

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe