B.R. Ambedkar: ఒక కొత్త మతం.. ‘అంబేద్కరమతం’ రాబోతున్నది!

ఎప్పుడని సరిగ్గా చెప్పడం కష్టం గానీ ‘అంబేద్కర మతం’ అనేది ఒకటి త్వరలోనే మెుదలై ప్రపంచంలోనే అతిపెద్ద మతాలలో ఒకటిగా రూపొంది వ్యాపించడం మాత్రం ఖాయం. ఇది వెటకారం కాదు. పరిహాసం కాదు. ఆవేదన అంతకన్నా కాదు. సమర్ధనగా రాస్తున్న అభిప్రాయం.

అగ్రకుల వామపక్షవాదుల మెప్పు కోసం, వారి చప్పట్ల కోసం, గుర్తింపు కోసం వారి అభినందన కోసమే బతికే అనేకమంది దళిత శుంఠలు అంబేద్కరును దేవుణ్టి చేయకండి అని పదే పదే వేదికల మీద నుంచి పలికే ముద్దముచ్చి మాటలని అందరూ వినివిని విసిగి ఉంటారు.

లేదూ అది నిజమే కదా అని సమ్మతించి ఉంటారు కనుక ఈ సూత్రీకరణ – అంబేద్కర మతం ఒకటి ఏర్పడుతున్నదనే సూచన, ఏర్పడకతప్పదనే మాట – వేళాకోళం కాదని స్పష్టం చేయడం అవసరం.

ఈ పోస్టులో చేసే వాదన లేదా ప్రతిపాదన ఏమంటే అంబేద్కర మతం అంటూ ఒక సరికొత్త మతం ఏర్పడి వ్యాపించడం అనివార్యమే కాదు అభిలషణీయం కూడా.

దేవుళ్లని నమ్మనివారు, దళితులు, మార్క్సిస్టులతో సహా దీనిని ఆహ్వానించాలి. దోహదం చేయాలి. ఊహాగానం అనండీ భవిష్యద్దర్శనం అనండీ, కేవలం ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులని భౌతికవాద చూపుతో బేరీజు వేసి చేస్తున్న అంచనా ఇది.

మతం మీద మూఢనమ్మకాలు

b r ambedkar

ఇది అర్థం చేసుకోడానికి మతం మీద ప్రబలంగా ఉన్న కొన్ని మతిలేని మూఢనమ్మకాలని వెంటనే వదిలించుకోవలసి ఉంటుంది. మతం పోయి దాని స్థానంలో సైన్సు అదంతట అది చారిత్రక క్రమంలో వస్తుందని కొందరు అనుకుంటారు. అలా అదంతట ఆ మార్పు రాదుగానీ మానవప్రయత్నంతో మతాన్ని రూపుమాపి, దాని స్థానంలో హేతువుని స్థాపించాలని కొందరు నమ్ముతుంటారు.

ఎందుకంత బలంగా నమ్మడమో, కనీసం వాదించడమో, చేస్తారంటే ఈ వాదన చేసేవారికే దాని పట్ల లోలోపల నమ్మకం ఉండకపోవచ్చు. అందుకే, అటువంటి అభిప్రాయాలని ఎలుగెత్తి చాటకపోతే, ధాటీగా వాదించకపోతే, చెప్పేవారికే ధీమా కలగదు.

శాస్త్రమూ (సైన్సు), సార్వత్రిక విద్యా, ఆధునిక, అత్యాధునిక జీవిత సరళీ, వాటి ఏర్పాట్లూ, అందువలన మానవ ఆలోచనల్లో వచ్చే మార్పులూ మరింత బలపడేకొద్దీ స్థిరపడేకొద్దీ, మత భావాలూ మత సంస్థలూ బలహీనపడి, చివరికి కనుమరుగైపోతాయనే పాత భావం చాలాకాలం మేధావుల మనసుల మీద రాజ్యం చేసింది. సాధారణ ప్రజలు సైతం అదే కామోసు అని అనుకున్నారు.

అవన్నీ తప్పుడు అంచనాలని చరిత్ర రుజువు చేసింది. ఇప్పుడు పరిశోధకులూ పండితులూ ఇలాంటి ఆశలనీ, భ్రమలనీ, ఒప్పుకోవడం లేదు. సాక్ష్యాధారాలని విస్మరించి మాత్రమే, లేదా ఈ పరిశోధనా ఫలితాలు తెలియకనే కొందరు ఇంకా ఇలాంటి వాదాలు చేయగలుగుతారు.

b r ambedkar

మతం చేసే పని మతానిదే. సైన్సు చేసే పని దానిదే. అందులో ఒకటి రెండోదాన్ని పూర్తిగా మింగేసే అవకాశం, విస్థాపన చేసిన దాఖలాలూ లేవు. మతం కాస్త పరిమితులలో కొంచెం నెమ్మదిగా మారుతుంది. సైన్సు వడివడిగా మారుతుంది.

కనీసం, మతం సైన్సు వెలుగులో తనని తాను మార్చుకుంటూ ఉంటుంది. సైన్సుకు అణుగుణంగా మారదు. సైన్సు వలన తన ఉనికి దెబ్బతినకుండా చూసుకుంటుంది. అందుకు అవసరమైన సర్దుబాట్లు చేసుకుంటుంది.

ఇక్కడ మతం అంటే విశ్వాసాలు మాత్రమే కాదు. దాని సంస్థలూ, వాటిని అనుసరించే వారి మతపరమైన అలవాట్లు, పాటించే ఆచారాలు. 

మతంతో సైన్సుకు సంబంధం (వ్యతిరేక సంబంధమైనా) తెగిపోయి శతాబ్దమవుతోంది. ఆ రకం సంబంధం ఇక మారే అవకాశంలేదు. ఈ చరిత్ర నుంచి నేర్చుకోవాల్సిన పాఠమేమంటే మతమూ సైన్సూ ఇవి రెండూ మానవజాతిలో అసమాన వనరులను ఆజమాయిషీచేసే వ్యవస్థలు మనుగడలో ఉన్నంత కాలం సహజీవనం చేస్తాయి.

మతం చేసే పనులలో కొన్నిటిని వేరే రంగాల ఆజమాయిషీలోకి తేవచ్చు. ఉదాహరణకి ఎవరు చదువుకోవచ్చూ లేదా ఏది చదువు అనే విషయం ఇంతకుముందు చాలా కాలం మతమే నిర్ణయిస్తూ ఉండేది. ఇప్పుడు ప్రభుత్వాలు, అంటే అవి నియమించే నిపుణులే, ఆ పని చేస్తారు.

కానీ, మతాన్ని పూర్తిగా సమాజం నించి తొలగించిన సందర్భాలు లేవు.

మరి మార్క్సిజం సంగతేమిటి?

b r ambedkar

తగిన చదువులేని ప్రతి బడాయికోరూ మతం గురించి మార్క్సిజం ఏంచెప్పిందో తెలిసిపడిపోయినట్టు మాట్లాడటం తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగు మేధావి లోకంలో ఈ బుకాయింపు చాలా మామూలు.

కానీ మార్క్సు చెప్పినదేమంటే అమానుషమైన పరిస్థితులలో మనిషిని మనిషిగా మతం నిలబెడుతుందని. అటువంటి అవసరమేలేనపుడు (దోపిడీ లేనపుడు) మతం అవసరమేపోతుందని ఆయన అన్నాడు. మతాన్ని నిషేధించాలని గానీ నిర్మూలించాలనిగానీ అనలేదు. మతం అవసరమయ్యే అటువంటి పరిస్థితులని మార్చాలని అన్నాడు. మతమే అనవసరం అనలేదు.

దోపిడీ పరిస్థితులు ఉన్నంతకాలమూ మతానికి అటువంటి పాత్ర ఉండొద్దని ఆయన అన్నాడనుకోడం తప్పు. మతం మత్తుమందు అనే కొటేషను అందరికీ తెలుసు. వారివారి అభిరుచులని బట్టీ ఆర్ధిక స్తోమత కొద్దీ మతం మార్క్సు ప్రకారం ఓల్డ్ మాంక్ రమ్ము, స్కాచ్ విస్కీ లాంటిదో అన్నాడనుకుంటారు.

మార్క్స్ అన్నది మతం ఒక నల్లమందు అని. ఇప్పటి రోజులలో దానిని అనస్తీషియా లాంటిది అనవచ్చు. వ్యసనం మాత్రమే కాదు. బాధోపశమనకారి. భ్రమగా కాదు. నిజంగానే. చికిత్సకూ ఉపయోగకారి.

అసలు అమానుషత్వానికి కారణమయిన దోపిడీని తొలగించితే రాజ్యంలాగనే మతం కూడా అవసరంలేకుండా పోతుంది. దీని అర్థం దోపిడీ కన్నా ముందే మతం మాయమైపోతే మనుషులు మరింత అమానుషత్వానికి గురవుతారు.

మతం ఇచ్చే ఓదార్పు కరువైతే వారు విప్లవం తొందరగా తెచ్చుకుని దానిని నిలబెట్టుకుంటే మంచిదే గానీ, అలా జరగకపోతే మతం మాయమైపోవడం వలన కొంపలు మునిగిపోతాయి. అంటే మతాలలో ఉన్న లక్షణాలన్నిటినీ అలాగే వుంచి కొనసాగించాలని కాదు.

పసి బాలికల యోనులని కుట్టేసి పెద్దయ్యాక మెుగుడు చిత్రహింస పెట్టి వాటిని అత్యాచారంచేసి ఆ కుట్లని తొలగించడం గానీ, అంటరానితనం గానీ ఇలాంటి మతాచారాలన్నీ ఉండాలని కాదు. ఉంటాయనీ కాదు. వాటి మార్పుకు పోరాటాలూ చట్టాలూ వద్దని కాదు. దురాచారాలని తొలగించాలి. మతాన్నే మాయం చేసేద్దామనుకోవడం దురాశ.

b r ambedkar

అసలు మతమే మాయమైపోవాలనీ నిర్మూలించాలనీ దాని స్థానంలో హేతువాదాన్ని శాస్త్రాన్ని పెట్టాలనే పిచ్చి ఆలోచనలకి చారిత్రక, అనుభవపూర్వక సమర్ధనే లేదు. సెక్సు పరికరాలు వచ్చిన తర్వాత స్త్రీపురుష సాన్నిహిత్యం ఎలా అంతమైపోలేదో సైన్సు వలన మతం కూడా అలాగే నిర్మూలనమైపోదు.

మరి మతం పేరు మీద మారణకాండలు, ప్రజారాశుల మధ్య చీలికలు, ఒకరిపట్ల మరొక సమూహానికి అపార్థాలూ, అందువలన అన్యాయాలు జరగలేదా అంటే జరిగాయి. అంతేస్థాయిలో మంచితనం, సహాయం, సహకారం, కీడు చేయగలిగీ చేయకుండా ఉండే సంయమనం కూడా మతం ఇచ్చింది. లేదా ఉండనిచ్చింది.

మతంలో చెడు మాత్రమే చూడటం సమగ్ర సమ్యక్ దృష్టి కాదు. అది ఇప్పుడు భూమ్మీద ఉన్న సాపేక్షంగా అతి బర్బరమైన అమానుషమైన మూడు మతాలకి – హైందవం, బౌద్ధం, ఇస్లాం – కూడా వర్తిస్తుంది. వీటిలోనూ మిగుల్చుకోగల మంచి అంశాలు చాలా ఉన్నాయి.

కాబట్టి మతానికీ సైన్సుకూ పోటీ పెట్టి ఒకటి రెండోదాన్ని ఆక్రమిస్తుందనే తప్పుడు భావాన్ని వదిలిపెట్టి, ఒక మతాన్ని మరో మతం మాత్రమే తొలగించగలదనీ, అదికూడా కొంత వరకూ మాత్రమే చేయగలదని గుర్తించాలి. లేకపోతే అన్నిమతాల వారూ వేర్వేరుగా పెట్టిన అగచాట్లకీ అణిచివేతకీ యూదు మతం ఎప్పుడో అంతరించిపోవాలి.

సరిగ్గా సైన్సులో కూడా ఒక సిద్ధాంతాన్ని మరో సిద్ధాంతం దెబ్బతీయవచ్చు లేదా విస్థాపన చేయవచ్చుగానీ, ఏ మతమూ సైన్సుని ఆక్రమించకోలేదు. వచన రచన ఎంత ప్రబలమైపోయినా కవిత్వం ఎలా అంతరించిపోదో ఇదీ అంతే.

అంబేద్కర మతానికి అవకాశాలు

b r ambedkar

ఇలా అంబేద్కరు మతం ఒకటి ఏర్పడి ఎదిగే అవకాశాలు ఉన్నాయనడానికి తగిన ఆధారాలున్నాయి. అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బాబాసాహెబ్ గారి మతం ఒకటి ఉంది కదా అని అనవచ్చు. ఆయన బౌద్ధ మతావలంబి అన్నది అందరికీ తెలుసు.

సరిగ్గా లెక్కలు లేవుగానీ ప్రపంచంలో అతిపెద్ద మతం బౌద్ధమే కావచ్చు. కాకపోతే రాబోయే అంబేద్కర మతం సంగతి వేరు. అంబేద్కర్ దానికి బోధిసత్వునిగా, ప్రధాన బోధకునిగా, ప్రవక్తగా ఉండే, మరో రకం కొత్త బౌద్ధం ఇది.

ఈ మాటలు వింటే, అది నిజమయ్యే అవకాశం ఉందని అనుమానం కలిగితే, చాలా మందికి గుండె పగిలిపోతుంది. మరీ ముఖ్యంగా కొంతమంది దళితులకి.

రాజ్యాధికార వ్యామోహంతో రగిలిపోతున్న ఆ రకం బుర్రలకి ఓట్లు పోగేయడం (మన దళితులంతా మన దళిత పార్టీలకి ఓట్లేసుకుంటే సరి) తప్ప మరే అంశమైనా తక్కువ విషయం లాగ, తప్పుదారిపట్టించే మాట లాగ తోచుతుంది మరి.

ఆపైన మతం ఒక మూఢనమ్మకమనీ దాని స్థానంలో సైన్సుని ఆలింగనం చేసుకుంటే సరిపోతుందనుకునే రకాలకి కోపం కూడా వస్తుంది.

అసలు ఒక మార్క్సిస్టు (నాస్తికుడని వేరే చెప్పక్కర్లేదు), అందునా ఆర్థొడాక్సు మార్క్సిస్టు అయిన నేను ఇలాంటి రాతలు రాయడం పతనం లాగ, పచ్చి అవినీతి లాగ, దిగజారుడు లాగ కూడా కనిపించవచ్చు. ఇది జాతకం లాగ అనిపిస్తున్నది గానీ చారిత్రక భౌతికవాదం లాగ లేదని తీసిపారెయ్యవచ్చు.

మరోసారి క్లుప్తంగా చెప్పుకుంటే: అంబేద్కర్ మతం వచ్చితీరుతుంది. అది అందరికీ మంచిది.

అంబేద్కర మత ఆవిర్భావాన్ని ఆలస్యం చేయడం, చీల్చడం, ప్రతి మతాలని ఏర్పరచడం సాధ్యమే. బహుశా అదే మొదటిలో జరగొచ్చు. ప్రతీకాత్మకంగానో పరోక్షంగానో అంబేద్కరుని పూజిస్తున్నారనే ఈసడింపుమాటల్లో వ్యక్తమయ్యే అసలు భావం అదే కావచ్చును.

ప్రత్యేక మత గుర్తింపుని ప్రభుత్వం కొంతకాలం నిరాకరించడం కూడా వీలవ్వచ్చు.

మత సంఖ్యా రాజకీయాలనీ దక్షిణాసియాలో మతాల అంతస్సంబంధాలనీ పెద్ద ఎత్తున తలకిందులు చేసే ఈ మతావిర్భావాన్ని ఎవరూ ఎంతోకాలం అడ్డుకోలేరు. దలైలామా నాయకత్వలో ఉన్న రకానికీ, తదితర బౌద్ధాలకి భిన్నంగా, అంబేద్కర మతం మరో ప్రత్యేక మతంగా రూపొందుతుంది.

దీనికి ‘బుద్ధ మరియూ అతని ధమ్మ’ అని అంబేద్కర్ రాసిన పుస్తకం ప్రధాన మత గ్రంథం అవుతుంది.

ఎందుకిలా జరుగుతుంది? ఎందుకిలా జరిగితీరాలి?

b r ambedkar

కనీసం దళితులవరకే తీసుకున్నాసరే అంబేద్కర్ పలుకుబడీ, ప్రతిష్టా, ఆయన పట్ల అభిమానం, గౌరవం ఏ స్థాయికి చేరుకున్నాయో గమనించండి.

ఒక మేధావి పట్ల, రాజకీయ నాయకుని పట్ల, సంఘ సంస్కర్త పట్ల, దళితుల వంటి ఒక పెద్ద జాతికి కుదురు చిహ్నంగా మారిన జాతి నాయకుని పట్ల వుండే పూజ్యభావపు దశ దాటిపోయి చాలాకాలమైపోయింది.

ఆయన పట్ల ఉన్న ఈ సానుకూల భావాల సమాహారానికి రూపమిచ్చే అలవాట్లూ, పబ్లిక్ ప్రదర్శక సాంప్రదాయాలూ, అవకాశాలూ దళితులకే అందుబాటులో లేవు. ఆయన పట్ల దళితులలో ఉన్న ఆరాధనాభావం సమాజంలో అలవాటుగా ఉన్న సన్మాన పద్ధతులని మించి దాటిపోయింది.

ఈ భావాలకి తగిన వ్యక్తీకరణ రూపం, దాని ఆనుషంగిక క్రతువులూ ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట కనిపెట్టక తప్పదు. లేదూ ఇప్పటికే ఉన్న ఆరాధనా పద్ధతులకు ఒక సంకలనమో క్రోడీకరణో ఎవరో ఒకరు చేస్తారు. అవి గాడిలో పడితే చరిత్రే లేదా ప్రజలే, గజిబిజిగానైనా ఒక విస్తృతరూపం ఇస్తారు.

అంబేద్కర్ మతం ఒకటి, దాని ప్రవక్తా, ప్రధాన మత గ్రంథమూ, అంటే ఇప్పటికే సిద్ధంగా ఉన్న లక్షణాలు ఉండనే వున్నాయి. పూజలూ అచారాలూ భజనలూ కీర్తనలూ మంత్రోచ్ఛారణలూ పవిత్ర స్థలాలూ తేదీలూ పండుగలూ నిషేధాలూ విధులూ ఆహార్యం ఆహార నియమాలు ప్రసాదం, పవిత్ర అపవిత్ర అంశాల విభజనా, వాటి పాలనకోసం ఏర్పాట్లూ, ఇవన్నీ ముందువెనుకలుగా వచ్చితీరుతాయి.

అంబేద్కర్ బౌద్ధం స్వీకరించిన వెంటనే చనిపోయారు. భారత దేశానికి రాజ్యాంగంలాగే బౌద్ధమతానికి కూడా మూల గ్రంథం రాసారు. దానిని ప్రచారమూ, బోధనా, అమలూ చేసి చూసే అవకాశం లేకపోయింది. అనుభవాన్ని బట్టీ ఆచరణనను చూసి అవసరమైతే కొత్త పద్ధతులనీ సూత్రాలనీ రూపొందించే అవకాశం లేకపోయింది.

అనుయాయులు బౌద్ధాన్ని దాదాపు ఒక కులపు ఆచారంగా మార్చారు. అది తప్పుకాదు. ఒక విశిష్టమైన సాంస్కృతిక వైచిత్రి. మహరు బౌద్ధం క్షీణించిపోయే అవకాశం లేదు, విస్తరించే అవకాశమూ లేదు.

నవయాన బౌద్ధం మహరుల కుల ప్రత్యేక సంస్కృతిగా మాత్రమే ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న దళితుల అవసరాలని తీర్చే అవకాశం గానీ అవసరం గానీ ఆలోచన గానీ మహరు బౌద్ధానికి లేవు. అడపాదడపా చేసిన అటువంటి ప్రయత్నాలన్నీ విఫలమయినాయి. విఫలమై తీరుతాయి. ఎందుకంటే నవయాన బౌద్ధం ఒక కులానికి చెందిన మతం. అవును, అదొక చిత్రమైన కేటగిరీ.

వ్యాపించే అవకాశం లేకపోడానికి మహరు బౌద్ధంలో ఒక ముఖ్యమైన వెలితి ఉంది. అంబేద్కరు ఇంకా బతికివున్న రోజుల్లో, అంటే గౌరవమేగానీ దైవత్వం ఇంకా రాని రోజుల్లో ఏర్పడ్డ మతం అది.

కొన్ని తరాలు లేదా శతాబ్దాలూ ఆగి, ప్రధాన వ్యక్తికి దైవత్వమో అతీత శక్తులో ప్రవక్త స్థానమో కలిగిన (కల్పించిన, ఆపాదించిన) తర్వాత మాత్రమే బలమైన మతం రూపొందే అవకాశం ఉందని ప్రపంచ మతాల చరిత్ర మనకి చూపుతుంది.

అంబేద్కరు చూపిన, చెప్పిన మతం కాదు, అంబేద్కర్ కేంద్రంగా, ఆయనే ప్రధానంగా ఉండే మతం ఒకటి, దళిత ప్రజానీకానికి కావాలి. ఆయనని రెండో స్థానంలో నెట్టే లౌకిక పద్ధతులైనా ధార్మిక పద్ధతులైనా దళిత ప్రజానీకాన్ని ఉర్రూతలూగించవు.

అంబేద్కరుని ఆమోదం సార్వత్రిక విషయం

b r ambedkar

రానురానూ అంబేద్కరుని ఆమోదించడం సార్వత్రిక విషయంగా మారిపోయింది. దళితుల చరిత్ర పొడుగునా ఆయనని ఇతరులు విస్మరించడం లేదా అన్యాయంగా విమర్శించడం చూసారు. పొగిడినా సరే, ఆయన కాలిగోటికి పోలని వారిని మరింత నెత్తిన పెట్టుకుని సాపేక్షంగా అంబేద్కరుని తక్కువ చేయడం మాత్రమే గమనించారు.

ఇతరులు అంబేద్కరుని పట్టించుకోడం ప్రస్తావించడం ప్రశంసించడం పరిశోధనలు చేయడం మొదలుపెట్టిన తర్వాత అది మరింత విస్తరిస్తుండటం చూసి మొదట్లో ఆనందం కలిగినా ముందుముందు అసూయ పుడుతుంది. మా అంబేద్కరుని మీరు మా నుంచి లాక్కుంటున్నారనే భావం కనీసం మధ్య తరగతి దళిత విద్యావంతులలో కలగక మానదు.

అంత మాత్రంచేత అగ్రవర్ణాలవారు అంబేద్కరుని రుచిచూసిన తర్వాత (మాకు అగ్రకుల దురహంకారం లేదని ప్రకటించుకోడానికి అంబేద్కరుని పబ్లిక్‌గా గౌరవించడమొక స్పష్టమైన సులువైన పద్ధతిగా మారింది) ఆ పని మానుకోరు.

అగ్రవర్ణాలలోనే తాము తక్కిన వెనుకబడిన సాంప్రదాయక పైకులస్తుల కంటే ఆధునికులమీ వికాసవంతులమీ అని చూపించుకొనేందుకు అంబేద్కరుని కావలించుకోవడం ఒక సాధనం అయింది.

ఫూలే పెరియార్‌లతోనూ ఇప్పటి దళితుల పేరిట ఇతరులు నడిపే ద్వేష ప్రచార ప్రాయోజిత సంస్థల భాషతో పోలిస్తే అంబేద్కర్ రచనలు, ఆయన మర్యాద తప్పని మాటలూ కప్పదాట్లులేని వాదనలూ అగ్రవర్ణాల మేధావులకీ విద్యావంతులకీ హాయిగా మెరుగయిన సున్నితమైన (అపాయంలేని) విమర్శలుగా అనిపిస్తాయి.

ఇప్పటికే అంబేద్కరు మీద మంచి పరిశోధనా పత్రాలూ మెరుగైన ప్రచురణలూ అన్నీ మినహాయింపులు లేకుండా అగ్రవర్ణాలవారే ప్రకటిస్తున్నారు.

దళితులకి, పాత అలవాటు ప్రకారం, మాకు అంబేద్కర్ ఎక్కువ చెందుతాడు లేదా మాకే చెందుతాడు, మాకు ఆయనకీ మధ్య సంబంధం తక్కినవారికంటే బలమైంది, సన్నిహితమైంది అని చాటి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర మతం అంటూ ఒకటి ఉనికిలోకి వస్తే ఆ అవసరం తీరుతుంది.

దళితులకు మరింత దగ్గరగా

b r ambedkar

మరి ఒక చారిత్రక వ్యక్తిత్వం చుట్టూ ఒక మతం అల్లుకుంటే అది ఆయన బోధనలకీ జీవిత సారాంశానికీ దూరమైనట్టే కదా అనిపించవచ్చు.

కానీ సామాన్య దళితుల వరకూ వస్తే అతన్ని దేవునిగా మార్చడం అతన్ని మరింత దగ్గరగా తీసుకోవడమే అవుతుంది. ఆయన మాటలూ ప్రస్తావనా రోజువారీ అంశాలు అవుతాయి. సంస్మరణ దినాలకీ విగ్రహాలకీ మాత్రమే పరిమితమైన పరిస్థితి పోతుంది.

రాజకీయ తాత్వికునిగా, రాజనీతివేత్తగా, సాంఘిక సంస్కర్తగా, హైందవ నాగరికత సమూల మార్పుని శాసించే రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే చూసేవారు అలానే చూస్తారు. చూడొచ్చు. దేవునిగా చూసేవారు తమ పద్ధతిలో అలానే భావిస్తారు.

బౌద్ధమే మా మతం అంబేద్కరు ఒక మతానుయాయి మాత్రమే అనుకునేవారు అలానే అనుకుంటారు.

ఇప్పటికే అంబేద్కరుకు సమ్మతీ గౌరవమూ లక్షల కోట్ల ప్రజలలో ఉంది. అన్నిరకాల, ఒకదానితో ఒకటి పొసగని పద్ధతులలోనూ ఆయనని అనుసరించడం వలన ఎవరి సంఖ్యా తగ్గిపోదు.

ఒక నిర్ణీత విభజన లేని ప్రస్తుత పరిస్థితికన్నా ఇలాంటి వివిధ సుస్పష్టమైన సూత్రబద్ధ భిన్న మార్గాలంటూ స్థిరపడితే తమకి అనుకూలమైన, ఆసక్తిచూపే, ఇముడ్చుకోగల సమూహాలేవో స్పష్టమైన పిదపే ప్రచారమూ చేర్చుకోవడమూ సులువు అవుతుంది.

ఇది చీలికలు పేలికలవ్వడం కాదు. ప్రతివారికి వారివారి మనోభావాలకి సరిపడే రకం గౌరవభావ ప్రదర్శన వీలవుతుంది. ఇది దక్షిణాసియా కాబట్టి అంబేద్కరుని దేవునిగా కొలిచే రకానికే ఎక్కువ మంది ఆకర్షితులవ్వడం ఖాయం.

దళితులకి మతం ఇవ్వడం ఇస్లాం ఎప్పుడో మానేసింది. అత్యధికరకాల చర్చిలు దళితులకు క్రైస్తవ మతం ఎలాగూ ఇవ్వవు. తక్కినవి క్రమంగా ఆసక్తిని కోల్పోయాయి. ఏదో వంక దొరికితే అత్యధిక రకాల భారతీయ చర్చిలు దళితులకు మతం ఇచ్చే పని పూర్తిగా మానేస్తాయి. సంఘపరివార వ్యతిరేక ప్రచారమూ క్రూర హంతకదాడులూ ఆ సాకుని అందించాయి.

ఆఖరుకు సంఘ పరివారం వాళ్లుకూడా ఏ అబ్రహామిక మతం కన్నా సిక్కు మతం కన్నా ఇదే నయం అనుకుని అంబేద్కరమతాన్ని అడ్డుకొనే ప్రయత్నం పెద్ద ఎత్తున చేయకపోవచ్చు. వారందరూ హిందువులని నమోదు చేసుకోవాలని అన్ని పార్టీలు కలిసి చట్టబద్ధమైన చర్యలు ఎలాగూ తీసుకుంటాయనుకోండి.

ఇవన్నీ అంబేద్కరమత పుట్టుకకూ వ్యాప్తికీ కలిసివస్తాయి.

బహుశా, ఆధునిక సమాజాల నాగరికతా స్థాయికి అనుకూలమైన విలువలతో, మతం తీర్చే, సమకూర్చే ఆధ్యాత్మిక అవసరాలని మేళవించే అవకాశం అంబేద్కర మతానికే ఉంది. ఆపైన తొందరగానే ఒక క్రిటికల్ మాస్‌ని సమకూర్చుకోగల అవకాశం అంబేద్కర్ బౌద్ధానికే ఉంది కనుక ఈ మతం తొందరగానే పెరిగి పెద్దవ్వడానికి చాలా అవకాశం ఉంది.

ఇది మరో పార్టీ కాదు, మరో సంస్థా కాదు

b r ambedkar

బౌద్ధం దైవం అనే భావం లేని ఏకైక మతం. శాంతి అనే భావన కేంద్రంగా ఉంది దీనిలో. బర్మా, శ్రీలంక, టిబెట్ బుద్ధిస్టులు మతానికి తెచ్చిన చెడ్డపేరు ఇంతా అంతాకాదు.

మరోవైపు అత్యధిక బుద్ధిస్టులు చైనా తరహా కమ్మూనిజంలో చిక్కుకుపోయారు. దలైలామా బౌద్ధాన్ని హైందవానికి తెగనమ్మడం దీనికి తోడైంది. ఈ పరిస్థితులలో బౌద్ధం పెద్ద ఎత్తున పునరుజ్జీవనం పొందాలంటే అంబేద్కర్ చుట్టూ అల్లుకున్నరకానికే ఆ శక్తి ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా లేట్ పెట్టుబడిదారీ సమాజాలలో మానసిక వ్యాకులత వ్యాప్తి వలన, అహింస కేంద్రంగా ఉన్న, మూఢనమ్మకాలకీ క్రతువులకీ ప్రాధాన్యత పెద్దగాలేని ఆత్మికతకూ, అంతర్ముఖత్వానికి సామాజిక స్వభావాన్ని మేళవించిన బౌద్ధానికి (తాంత్రిక తరహాకాదు) ఎంతో ఆహ్వానం ఉన్నది. ఆదరణా లభిస్తుంది.

ఇలాంటి అంబేద్కర మతం అంటూ ఒకటి వస్తే మరో చీలికకి తెరతీసినట్టే అని కొందరు అనుకునే అవకాశం వుంది. ఇప్పటికే ఇన్ని చీలికలు పేలికలుగా వున్న అంబేద్కర్ అనుయాయులూ సంఘాలు పార్టీలకి తోడు కొత్తగా ఇదొకటి చేరుతుందని అనుమానిస్తారు. ఐక్యత దెబ్బతింటుందని గాభరా పడతారు. దళితులలో కూడా సర్వామోదం సాధ్యం కాదని వాదిస్తారు.

ఇవే మాటలు ఏ కొత్త ఉద్యమం వచ్చినా యధాస్థితివాదులు చెబుతారు. కానీ ఇది మరో పార్టీకాదు. మరో సంస్థాకాదు. మరో ప్రచార కార్యక్రమం కాదు. కొత్త మతం. కొత్తరకం మతం. అన్నిరకాల అంబేద్కరు అనుయాయులూ ఇతర పార్టీలలో వుండేవారూ దీనికి మద్దతు ఇచ్చే అవకాశమే ఎక్కువ.

నిజానికి తెలుగు రాష్ట్రాలలో బౌద్ధం మీద అభిమానం చూపేది (దళిత) క్రైస్తవులు. తమలో చేర్చుకోవడానికి ఇబ్బందిపడే ముస్లిం సంస్థలూ ఇతర మైనారిటీ మతాలు రకరకాల పద్ధతులలో బయటినించి మద్దతు ఇచ్చే అవకాశమే ఎక్కువ.

దళితులు అధికార పత్రాల వెలుపల (నాటి గాంధీ నుంచి నేటి సీపీయం దాకా అందరూ కూడబలుక్కుని దళితులమీద రిజర్వేషన్లు లాగేసుకుంటామని విధించిన ఏకపక్ష నిర్బంధం) హైందవాన్ని స్వీకరించకుండా వేరేగా నిలవడమే మత సామరస్యానికి మంచిదని అందరికీ తెలుసు.

కనీసం హైందవ మతస్తుల సంఖ్య తగ్గుతుంది. అది అన్నిరకాల మైనారిటీ మతాలకీ మతసామరస్యం కోరేవాళ్లకీ నాస్తికులకీ ప్రగతికాముకులందరికీ ఆమోదయోగ్యం అవుతుంది. వారి సహాయం అందుతుంది.

కేవలం పైకులాల దళిత చెమ్చాలు మాత్రమే గొప్పకోసం కొంతకాలం ఈ మతాన్ని గేలి చేస్తారు. ఆడిపోసుకుంటారు. ఆ వ్యతిరేకత కూడా మంచిపనే చేస్తుంది. కొత్త మతం తీసుకునే రూపాలూ చేసే పనులూ సాటివాళ్ల విమర్శలతో మరింత మెరుగవుతాయి.

కొత్త ఉద్యమాలు ఉన్న ఉద్యమాలని చీల్చే అవకాశం తక్కువ. కొత్త ప్రజానీకాలని కార్యశీలం చేసే అవకాశాలు ఎక్కువ. అన్నిమతాలలాగే అంబేద్కర మతం కూడా ఉద్యమంగానే మొదలవుతుంది లేదా ఉద్యమాలే తమ యోచనల్లో ఆచరణలో ఈ కొత్త మతాంశాన్నిపెంపొందించుకుంటాయి.

కేవలం అడపాదడపా జరిపే అంబేద్కరు సభలని నింపే సాధారణ దళితులు, మరింత కార్యశీలమవ్వడానికి అంబేద్కరు మతం ఉపయోగపడుతుంది. ఆయన బోధనలు చిన్నతనం నుంచీ ప్రతిరోజూ చెవుల పడతాయి. ఇదంతా ఇప్పటికే ఉన్న దళిత ఉద్యమాలని, ఉమ్మడి కార్యాచరణలని చీల్చదు. సాయపడుతుంది.

ఈ మతం నుంచి వయసు వచ్చిన తర్వాత బయటికి వచ్చేవాళ్లకి కూడా నాస్తికులయ్యేవారికీ మార్క్సిస్టులయ్యేవారికీ కూడా అప్పటికే మత విద్యగా అంబేద్కరు బోధనల మీద బౌద్ధం మీద పట్టు ఏర్పడుతుంది.

విద్యా ఉద్యమ కళా రంగాలలో లోతైన మత విద్యని అభ్యసించి వచ్చినవారే ఎప్పుడూ రాణిస్తుంటారు. ఎక్కువ ప్రతిభని చూపుతుంటారు. అందువల్ల దళితులు అందరూ ఈ మతం పుట్టుకవలన వ్యాప్తివలన సాయం పొందుతారు. ఇతరులెవరికీ నష్టం రాదు. దేశానికీ దక్షిణాసియాకూ చాలా మంచిమేలు కలుగుతుంది.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe