World Book Day: కులవ్యవస్థ పోవాలంటే ‘పుస్తకం’ నశించాలి

మొన్న ప్రపంచ పుస్తక దినం. పుస్తకం చుట్టూ అల్లుకున్న ప్రవర్తనా వైఖరులూ అది సాధనంగా వచ్చిపడిన సంఘమార్పులూ ప్రగతీ సంస్కారమూ మనోవికాసమూ మనోల్లాసమూ, పెంచుకునే రకరకాల పాటవాలూ వచ్చే సాంఘిక రాజకీయ భావ విప్లవాలూ గురించి చాలా మంది ఆసక్తికరమైన విలువైన విషయాలు చాలా రాసారు.

ఎక్కువగా వ్యక్తుల అనుభవాల గురించే రాసిన అవి చదివేవారందరి లేదా పుస్తకప్రియులందరి సమిష్టి అనుభవాలకి ఎంతో కొంత ప్రాతినిధ్యం వహిస్తున్న ఎరుకతోనో రాసినట్టున్నాయి.

గుండె ఆనందంతో నిండిపోయే ఆ మహత్తర విషయాలని వదిలేసి కొన్ని గత్తర అంశాలని మాట్లాడుకుందాం.

‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో’ అనే మాట తెలుగువాళ్లకి బాగా తెలుసు.

చాలాకాలంగా ఓ అగ్రగామి తెలుగు ప్రచురణ సంస్థ, పంపిణీ విక్రయాలలో కూడా అతి పెద్దది, తమ పేపరు సంచుల మీద ఆ వాక్యాన్ని పెద్ద అక్షరాలతో ముద్రించారు కూడా. అది ఒక కమ్యూనిస్టు సంస్థ.

వినియోగ మనస్తత్వం మంచిదన్నట్టు, ఆ వైఖరి మనమంచికే అన్నట్టు ఉంటుంది ఆ కోటేషను.

ఆ బోధన త్యాగమో సంస్కారమో వనరుల గరిష్ట ప్రయోజనం కోసం ఇచ్చిన చిట్కానో అన్నట్టు ఎంత అలవోకగా ఉంటుందో చూడండి.

సందేశమూ ఆదేశమూ కలగలిసిన ఆ ఆకర్షణీయమైన వంచన మనల్ని కట్టిపడేస్తుంది.

ఆ ఉద్భోధ ఒక వ్యక్తినే సంబోధిస్తుంది. కొనుక్కోండి అనదు. కొనుక్కోవాలి అనదు. కొనుక్కో అంటుంది.

అందరితో మాటాడినా విడివిడిగా మాటాడుతుంది. వారిని వ్యక్తులుగా వ్యవహరిస్తుంది. చదువుకో అనదు, కొనుక్కో అంటుంది ఆ వాణి.

ఏ సందర్భంలో అన్నారో తెలియదు గానీ అన్న పెద్దమనిషి గౌరవనీయుడు. దానిని మన బుర్రలలోకి ఎక్కించేది కమ్యూనిస్టులు. జరుగున్న ప్రచారమేమో పెట్టుబడిదారీ విలువలకి.

ఇదంతా గందరగోళంగా ఉందంటే అది సహజమే. అది ఈ పరిస్థితిలోనే ఉన్న గందరగోళం. కారణం వస్తుగత వాస్తవంలోనే ఉన్న కలగాపులగత్వం.

బొమ్మ కొనుక్కున్నప్పుడు పిల్లలకి సంబరమేదో కలుగుతుంది. హోటల్లో భోజనం చేసినప్పుడు ఒక మౌలిక అవసరం తీరుతుంది.

అవసరం తీరడమో ఆనందం కలగడమో అందుకు వెల ఉండటమో పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగడానికి సరిపోవు. పెట్టుబడిదారీ విధానం పెరగకపోతే కూలిపోయే చోద్యమైన వ్యవస్థ.

అవసరమైన దానికి ధర ఉండడం ఈ విధానానికి సరిపోదు. ఈ వ్యవస్థకి చాలదు. అనవసరమైనవే అత్యధికంగా ఉత్పత్తికావడం వినయోగమవ్వడం దీని లక్షణం.

కొనడం కొనడం కోసమే, కనీసం వాడటం కోసం కూడా కాదు అనే విపరీత దశకోసం అది తపిస్తుంది. మనల్ని ఆ దిశగా నడిపిస్తుంది.

ఇంకా తెలుగు సమాజంలో పెట్టుబడిదారీ భావాలు వేళ్లూనుకోకముందే ఈ విలువ వచ్చిపడింది. అప్పటికి పెట్టుబడిదారీ సంబంధాలే ఆర్ధిక వ్యవస్థలో ప్రత్యక్షంగా రాలేదు. వ్యక్తుల జీవితానుభవంలోకి అసలే రాలేదు.

పెట్టుబడిదారీ విలువలు

పెట్టుబడిదారీ విలువలూ అనుభవాలన్నీ పరోక్షంగా దూరంగా రకరకాల వంకరలకి గురై వచ్చినవే.

అయినా, ఈ కడపడి దశ పెట్టుబడిదారీ (లేట్ కాపిటలిస్ట్) సూత్రం, మనోభావం మాత్రం తెలుగు పైకులాల విద్యావంతుల శ్రేణులలో ప్రవేశించింది. వారి ద్వారా మొత్తం తెలుగు సమాజ శిష్ట సంస్కారంలో తిష్ట వేసింది.

ఇదంతా పుస్తకం పేరుతో పుస్తకం సాకుగా పుస్తకం గురించి అల్లుకున్న అమాయకమైన భావంగా వచ్చింది. కొనడం ఒక ఉత్తమ నీతి, కల్తీలేని గౌరవనీయ సంస్కారంగా నెలకొన్నది.

ఆ పైన, ఎంత కొన్నా ఇంకా తగినంతగా కొనలేదనే అపరాధభావం, తగినన్ని సరుకులు కొనలేదనే వెలితీ లేదా అవమానభారం ఈ శ్రేణుల వ్యక్తులలో మిగిలిపోతూనే వుండేది.

అయితే అది మానవ స్వభావం కాదు. వ్యసనం. అది మనుషులు వినియోగదారులుగా మారిపోయినపుడు కలిగే పర్యవసానం.

ఒక వ్యసనాన్ని సహజ ప్రవర్తనగా పెట్టుబడిదారీ ప్రవర్తనా సూత్రాలు మార్చిపారేసాయి అనడానికి నిదర్శనం. ఈ కృత్రిమత్వం ప్రవృత్తిలా కనిపించిందంటే కేపిటలిజం మీ కళ్లని పూర్తిగా కమ్మేసిందనీ కప్పేసిందనీ అర్థం.

పుస్తకం కొనడమనే అలవాటు పెరగాలి, పెంచాలి అంటూ ఉంటారు బాధ్యతాయుతమైన, వివేకమంతులైన పెద్దలు. మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు మేధావులు. కొత్త తరానికి ఈ అలవాటు చేయాలి అని వీరి సదుద్దేశం.

పుస్తకం కొనడం వలన దానికి ధర చెల్లించడం వలన వాటిని చదివే అవకాశం ఎక్కువ ఉంటుందని వీరి అంచనా కావచ్చును. కనీసం ఈ కొనుగోళ్ల వలన రచయితలకూ ప్రచురణకర్తలకూ మేలు జరుగుతుందని వీరి సదాశయం.

పెట్టుబడిదారీ విధానం నుంచి వచ్చిన, లేదా దానికి అణుగుణమైనదైన లేదా దానిని పనిగట్టుకొని వ్యతిరేకించని ఆలోచనా ధోరణులలో, భావపరంపరలో, ఆశయాలలో, ఆచరణలలో ఏ ఒక్క సుగుణమైనా ఉందా అని ఈ బుద్ధిమంతులని వేరేగా అడిగితే మాత్రం, లేదని తేల్చిచెబుతారు.

పెట్టుబడిదారీ వ్యవస్థలో గానీ విధానంలో గానీ ఏమయినా మంచి ఉందా అని వీళ్లని అడిగితే లేదే లేదని ఉండే అవకాశమే లేదని తేల్చి చెబుతారు.

మరి వారు స్వయంగా స్వచ్ఛందంగా చెప్పే పుస్తకం కొనుక్కో అనే ఈ సూచన పచ్చి పెట్టుబడిదారీ నీతే కదా, వినియోగ మనస్తత్వమే కదా అనే ధ్యాస మాత్రం వుండదు. ఈ ఒక్క విషయంలోనే ఎందుకోగానీ ఉండదు.

దీనికి కారణం ఏమై ఉండవచ్చు?

telugu bible

ఆధునిక తెలుగు సమాజంలో ఏ విషయమైనా వస్తువయినా సేవ అయినా సరుకుగా మారడాన్ని వ్యతిరేకించే అలవాటు కమ్యూనిస్టులకే కాదు విద్యావంతులూ కళా సాహిత్య సంస్కృతీపరులందరికీ ఉంది.

సాంప్రదాయవాదులకీ ప్రగతినిరోధకులకి కూడా ఇదే అలవాటు.

ఏ భౌతిక బౌద్ధిక విషయమైనా సరుకుగా మారడం ఆపలేనప్పుడు కనీసం ఖండించే, విమర్శించే, విలపించే, వగచే సంస్కృతీపరులూ మేధావులూ ఉన్నత విద్యావంతులూ కమ్యూనిస్టులూ ఒక్క ‘పుస్తకం’ విషయంలో మాత్రమే పెట్టుబడిదారీ ఆలోచనని స్వచ్ఛందంగా ప్రచారం చేయడానికి నేపథ్యం ఏమిటి?

ఇది బహుశా కేవలం పెట్టుబడిదారీ ఆలోచనే కాకపోవచ్చును. మన సమాజపు సంస్కారంలో మంచీ చెడూ ప్రగతిశీల సాంప్రదాయ వగైరా ఆలోచనలన్నిటిలోనూ బ్రాహ్మణీయ భావజాలం, హైందవ మతాచారం ఉండకుండా చేరకుండా వ్యాపించకుండా లేదా వ్యతిరేకించకుండా ఏ అంశమూ ఉండదు.

ఈ సరుకుగా మారడాన్ని ఒక్క వస్తువు విషయంలో మాత్రమే సమర్ధించే సహకరించే మన తెలుగు సంస్కార విచిత్రానికి ఇటువంటిదేమైనా ఉందా లేదా అని చూడాలి.

చూస్తే, దీనిలో క్రయవిక్రయాల వ్యాపార విలువతో బ్రాహ్మణీయ విలువ కూడా ఉందని బయటపడుతుంది. దాని నేపథ్యం ముందు గమనిద్దాం.

మన తెలుగు సమాజ చరిత్ర మొత్తంలో ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలని అందుకున్న రకాల పుస్తకాలు రెండే రకాలు.

మొదటిది క్రిస్టియన్ మిషనరీలు తీసుకొచ్చిన రెండు రకాల బైబిళ్లు: పాత నిబంధన గ్రంథం. కొత్త నిబంధన గ్రంథం.

రెండోది సోవియట్ రష్యా వారు పంపించిన సర్వ అధ్యయన రంగాల పుస్తకాలు.

ఇప్పటికీ పుస్తకానికి సంబంధించిన ఏ అంశం తీసుకున్నా వీటికి సాటిరాగలవి ఇంకా రాలేదు.

నాణ్యమైన కాయితం, అచ్చులో అన్ని పార్శ్వాలు, స్పష్టతా, అచ్చుతప్పులు లేకపోవడం, పట్టిష్టమైన అట్టా, డిజైనూ, మన్నికా.. ఇలాంటి అన్ని విషయాలలోనూ ఇప్పటికీ ఈ రెండు రకాల పుస్తకాలే తెలుగులో అచ్చయిన పుస్తకాలలో మేలురకం.

ఎనభైల చివరినుంచీ తెలుగులో సాహిత్య పుస్తకాల నాణ్యత బాగా పెరిగింది. బొమ్మల ఆల్బములూ, కాఫీటేబిలు పుస్తకాలూ ఖరీదైనవి వచ్చాయి.

కానీ అవికూడా పైరెండు రకాల పుస్తకాల ముందూ దిగదుడుపే.

ఇంకా ముఖ్యమైన విశేషం, పై రెండు రకాల పుస్తకాలను ఉచితంగా పంచారు. బదులుగా ఏమీ పుచ్చుకోలేదు.

సోవియట్ యూనియన్ వారు వీటిని ఉచితంగా పంపి ఊరుకోలేదు. వాటిని షిప్ యార్డులో నిల్వచేసేందుకు ఏర్పాట్లు చేశారు. వాటిని దేశమంతటా పంపిణీ చేసే ఖర్చులు పెట్టుకున్నారు.

ప్రతి జిల్లాలోనూ ఆ పుస్తకాలని విక్రయించే భవనాలని కొనిచ్చారు. అందులో ఉద్యోగులకి వేతనాలు చెల్లించారు. ఆ పుస్తకాలని ఊరూరా తిప్పడానికి ఎక్కువమందికి చేరవేయడానికి వాహనాలని కొన్నారు.

ఈ భాషలోకి అనువాదం చేసేందుకు సమర్థులైన అనువాదకులని ఆ దేశంలో – అంటే సోవియట్ రష్యాలో – ఉండి పనిచేసుకునేలా ఉద్యోగాలు ఇచ్చారు.

అక్కడ సర్వ ప్రచురణా సదుపాయాలతో కూడిన ఒక తెలుగు భాషా ముద్రణాలయాన్ని నడిపారు.

ఇంకా, ఈ పుస్తకాల ఎంపికలో ప్రచురణలో పంపిణీలో అన్ని దశలలోనూ అన్నిరకాల ఖర్చులని పెట్టుకుని పుస్తకం దానిని స్వీకరించిన వారికి చేరేదాక సమస్తమూ ఉచితంగా ఉండేలా చూసుకున్నారు.

ఎక్కువ అమ్ముడయితే ఎక్కువ ధరలు

మరి మనవాళ్లేం చేశారు? ఆ పుస్తకాల మీద నామ మాత్రపు ధరని వేసి అమ్మారు. వాటి ధరలనీ క్రమంగా పెంచుతూ పోయారు.

ఎక్కువగా అమ్ముడుపోతున్న పుస్తకాలకి ఎక్కువ ధరలు పెట్టారు. ఇవన్నీ ఉచితంగా వస్తున్న పుస్తకాలనే విషయం ఎవరికీ పొక్కకుండా చూసుకున్నారు.

ఆ విషయం తెలిసిపోయినవాళ్లకి వాటి నిల్వకీ పంపిణీకీ రద్దుకీ పార్టీ ఫండుకీ ఈ నామమాత్రపు ధరలు అవసరమని చెప్పి నమ్మించారు. లేదూ నమ్మినట్టుగా వాళ్లు చెప్పినవాళ్లని నమ్మించారు.

ఈ విషయం మీద ఎవరూ నోరెత్తలేదు. ఉచితంగా ఇస్తే అవసరం లేనివారు కూడా తీసుకుపోయి వృధా చేస్తారని వీరు అనేవారు. పొట్లాలు తయారుజేసుకుంటారని హెచ్చరించారు.

ఉదాహరణగా దళసరి నాణ్యమైన పేజీలలో ప్రచురించే బైబిలు, క్రైస్తవ బోధనా కరపత్రాలని చూపించారు.

ఇక బైబిలు కథ మరింత ఆసక్తికరమైనది. వాటినెవరూ కొంత లాభం వేసుకుని అమ్మలేదు.

తెలుగు ప్రాంతాల అంచులలోనో మధ్యలోనో ఉన్న ఇతర భాషలు మాట్లాడేవారున్న మారుమూల ప్రాంతాలకి మిషనరీలు పోయి అక్కడే ఉండిపోయి ఆ భాషను నేర్చుకుని బైబిలును ఆ భాషలోకి అనువదించి తెలుగు పాఠం కూడా సమాంతరంగా ఇచ్చి బైబిలు ప్రతులను ఉచితంగా పంచారు.

ఆపైన తెలుగు అనువాదం ఎలానూ వుంది. బ్రౌను దొర తెలుగు గురించి ప్రస్తావిస్తే మన పండితుల తెలుగు భాషాభిమానుల అభిమానం, కృతజ్ఞత, ఆయన పాండిత్యం, సేవల గురించిన కథలూ కట్టలు తెంచుకుంటాయి.

ఆయన కూడా ప్రామాణిక తెలుగు బైబిలు అనువాదకులలో ఒకరట.

ఈ క్రైస్తవ, కమ్యూనిస్టు పుస్తకాలకి రెంటికీ ఉన్న ఉమ్మడి గుణాలు అసమాన నాణ్యతా అమూల్యతా (ధర లేకపోవడం, ఉచితం) మాత్రమే కాదు. ఆ పుస్తకాలలోని భావాల ప్రచారమూ, వ్యాప్తీ వాటి ఉద్దేశ్యం, లక్ష్యం.

ఇవి ససేమిరా సరుకుగా మారబోమని ప్రకటించిన పుస్తకాలు. అమ్మకం కొనడం లాభం అనే ప్రాథమిక పెట్టుబడిదారీ మార్కెటు లక్షణాలని సంపూర్ణంగా తిరస్కరించిన పుస్తకాలు.

పొసగని విలువల సామరస్యం

Communist Manifesto Telugu

ఇటీవలి కాలపు తెలుగు పుస్తకం చరిత్ర అంతా, అది ఏరకం పుస్తకమైనా సరే, ఆ రెండు రకాల నాణ్యమైన ఉచిత ప్రచార పుస్తకాలలో సాకారమైన విలువలనీ ప్రదర్శించే విలువలనీ అన్నిరకాలుగా వ్యతిరేకించడమేనని చెప్పవచ్చు.

స్వభావంలో స్వరూపంలో ఉద్దేశాలలో లక్ష్యాలలో పరిశుద్ధ గ్రంథమూ సోవియట్ ప్రచురణలూ ఒకవైపు. అన్నిరకాల తెలుగు పుస్తకాలూ మరోవైపు.

అంటే క్రైస్తవ, కమ్యూనిస్టు (పుస్తక) విలువలు ఒక వైపూ వాటికి విరుద్ధంగా కేపిటలిస్టు బ్రాహ్మణీయ (పుస్తక) విలువలు మరోవైపు.

ఈ విభజనలో తెలుగు కమ్యూనిస్టులు కమ్యూనిస్టు సాహిత్యకారులూ సోవియటు కమ్యూనిజానికి వ్యతిరేక కేంపులో ఉన్నారన్నది ముఖ్యం.

లాభదృష్టీ దానిని తిరిగి పెట్టుబడిగా పెట్టాలనే కట్టుబడీ, ప్రతిదీ సరుకుగా మార్చే సంకల్పమూ, అందుకోసం విద్యా పరికరాల మార్కెట్ విస్తరించడం కోసం అందరికీ చదువుని అందించాలనే అంతర్గత చోదన ఉన్న పెట్టుబడిధారీ విధానం, జ్ఞానాన్ని పెంచకూడదు, పంచకూడదు, ఉన్నదాన్ని నేర్చుకోవాలి, దాన్ని దాచుకోవాలి అనే బ్రాహ్మణవాద ఆలోచనా ధారా రెండూ వేర్వేరు. అవి ఒకదానికొకటి సూత్రరీత్యా పొసగవు.

కానీ పుస్తకాలకి ఎప్పుడూ ధర ఉండాలి. ఉచితంగా ఉండకూడదు అనే విషయం వద్ద ఈ రెండూ ఏకీభవించాయి. రాజీ కొచ్చాయి.

ఆ సూత్రబద్ధమైన తగవుని నిజ జీవిత కార్యాచరణలో తీర్చినదీ, ఆ విరుద్ధ మనస్తత్వాలకి సామరస్యం సాధించినది కమ్యూనిస్టులు.

వారు బ్రహ్మనిజం నుంచి పూర్తిగా బయటపడలేదు కనుక కమ్యూనిజం స్పూర్తిని తగినంతగా వంటబట్టించుకోలేదు కనుకా అది సాధ్యపడింది. కొన్నిసార్లు వెనుబాటుతనం కొన్ని అసమాన పాటవాలని ఇస్తుంది.

ఒక పేద దేశంలో, ఓ మాదిరి స్థితిమంతుల పిల్లలకు కూడ తగిన డబ్బులు ఉండని భారతీయ సమాజంలో, జ్ఞానాన్ని పంచడానికి వీలయినన్ని చిక్కులు పెట్టేందుకు, పుస్తకాలని ఉచితంగా ఇవ్వకూడదనే విలువ దగ్గర బ్రాహ్మణిజమూ కాపిటలిజమూ చేతులు కలిపాయి.

ఆ పనిని చేసినవారు రెండు రకాల బృందాలు. కమ్యూనిస్టు ఉద్యమం. సాహిత్య బృందాలు.

ఈ రెండు సమూహాలూ కలిసే కూడలి పుస్తకం. పుస్తక ప్రచురణ. అధ్యయనం. ప్రభావం. చర్చ. రాత. సమీక్ష. విమర్శ. అనుకరణ. అనువాదం.

ఆ పని చేసేందుకు బ్రాహ్మణిజం ఎందుకు ముందుకు వచ్చిందంటే అప్పటికే అది పునర్నిర్మాణ దశలో వుంది. మూడో దశలో వుంది.

ఇప్పటికీ కొనసాగుతున్న ఆ దశలో అప్పటికే ప్రవేశించివుంది.

చదువూ జ్ఞానాలపై గుత్తాధిపత్యం

చదువులో జ్ఞానంలో బ్రాహ్మణిజపు మూడు స్థూల దశలలో మొదటిది గుత్తాధిపత్య దశ. అంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే జ్ఞానాన్నీ చదువునూ గుప్పిట్లో పెట్టుకున్న దశ.

ఆ తర్వాత సర్వాధిపత్య దశ. ఇతరులు కూడా దానిలో ప్రవేశించిన దశ. కానీ బ్రాహ్మణీయ విద్యా జ్ఞానమూ వారి కనుసన్నలలోనే ఉంటూ వారి అభీష్టం మేరకే తక్కినవారు వాటిని గడించే వాడే పరిస్థితి.

ప్రతిష్టల నిర్ణయం, పంపిణీ ఇంకా బ్రాహ్మణ, లేదా బ్రాహ్మణీయ పీఠాల వద్దనే వుంది.

మూడోది సర్వోత్తమ దశ. బ్రాహ్మణేతరులు, బ్రాహ్మణ వ్యతిరేకులు, బ్రాహ్మణ నిరపేక్ష విద్యావంతులు కూడా వారితో పోటీపడటమూ, వారి వ్యతిరేక భావాలను కూడా ఉత్పత్తి చేయటమూ, చేసి మనగలగటమూ జరుగుతున్నప్పటికీ, బ్రాహ్మణులు అందరికన్నా అన్నిటిలోనూ ముందున్న దశ.

వివిధ విప్లవ ఆలోచనలలో ఉద్యమాలలో చేరడమూ సగటు సభ్యులకన్నా మరింత విప్లవాత్మకంగా రాడికల్‌గా లేదా నిబద్ధంగా పరిశుద్ధవాదులుగా ఉంటేనే సర్వోత్తమత్తం నిలుపుకునే అవకాశం ఉండే దశ.

పుస్తకాన్ని సరుకుగా మార్చి అది మంచిదని ప్రచారం చేసిన తీరు ఈ దశలో బ్రాహ్మణిజం కేపిటలిజంతో చేసుకున్న సర్దుబాటులాగా ఉంది. ఆ ప్రచారమే కాలం చెల్లినప్పటికీ ఇంకా కొనసాగుతున్నది.

ఈ మూడో దశలో ఉన్న బ్రాహ్మణిజం ఇతర అగ్రవర్ణాలతో చేతులుకలపడానికి కమ్యూనిజం, స్వతంత్య్ర పోరాటం, వివిధ రకాల సాంస్కృతిక విద్యా విధానాలు, సంస్కరణలు గానీ వాటి వ్యతిరేక పోరాటాలు, ప్రచారాలు గానీ ఉమ్మడి పైకులాలలో ఒక విద్యావంతులు సభ్య సమాజం ఏర్పడటానికి దారితీసింది.

ఇతరులు పుట్టుకతో అనర్హులూ మేం చదువు చెప్పం అనే పరిస్థితి కోల్పోయి రాజీకొచ్చిన దశ.

కానీ స్తోమత గానీ కుల కుటుంబ సంప్రదాయం గానీ పుస్తకాల భావ ప్రచారాల గుంపులతో పరిచయాలూ ప్రవేశమూ ఉంటే తప్ప (ఇవి సమకూర్చుకోవడం అందరికీ వీలుకాదన్నదీ ఈ అవకాశం అసమానంగా పంపిణీ అయివుంటుందన్నదీ స్వయం విదితమే) తగిన పుస్తకాల గురించి తెలుసుకునే అవకాశంలేని పరిస్థితి ఇది.

కొందరి కనుసన్నలలోనే

ఆఖరుకు కమ్యూనిస్టు సిద్ధాంతం కూడా పుస్తక సంచయం సొంత లైబ్రరీల రూపంలో కొంతమంది దగ్గరే పోగుపడి వారి కనుసన్నలలోనే వాటితో పరిచయం అధ్యయనం సాగే పరిస్థితి చాలా కాలం కొనసాగింది.

రాజకీయ పండిత సాహిత్య బృందాల గుప్పిట్లో ఇదంతా ఉండేది.

వారి కనుసన్నలలో వారి నాయకత్వంలో దర్శకత్వంలో చదువరులందరూ ఉండిన, అది సహజమని అందరూ అనుకున్నారు ఆ కాలంలో.

ఈ బృందాల నాయకుల పేట్రన్ల దాతృత్వం, ఉదారత, సహృదయత గురించిన కథలు మన జీవిత చరిత్రల స్వీయ చరిత్రల జ్ఞాపకాల ముందుమాటల నిండా కొల్లలుగా దొరుకుతాయి.

ఇప్పటికీ ఆ దశకి సమకాలీన అంచనాలు మారినట్టులేవు.

ఈ మేధో సాహిత్య ఆలోచనాపర వృత్తాల, బృందాల అవసరం గానీ అవి సాధ్యపడటం గానీ తగిన సంఖ్యలో అన్నిచోట్లా ఉచిత పుస్తకాల పంపిణీలేకుండా చేయడం మీదనే ఆధారపడి ఉంది.

అసలు ఆ ఆలోచననే నిషేధించడమ్మీద ఆధారపడి ఉంది.

ఈ సరళీకరించిన మోడల్‌లో, మొరటు చారిత్రక రేఖాచిత్రంలో, కావాలనే బ్రాహ్మణవ్యతిరేక ఉద్యమాలూ, బ్రిటిష్ పాలనా, క్రైస్తవ విద్యా, సోవియట్ యూనియన్ పరోక్షంగా పోషించిన పాత్రని ప్రస్తావించలేదు.

వాటన్నిటినీ కలుపుకుంటే మరింత సమగ్రంగా ఉంటుంది గానీ ఈ వ్యాసం విస్తారమైపోతుంది.

క్రైస్తవ, కమ్యూనిస్టు స్ఫూర్తిపై పోరాటం

తెలుగు సాహిత్య చరిత్ర అంటే ప్రాచీన యుగం నుంచి కుంఫిణీ యుగం వరకూ బౌద్ధం ఛాయలను అవశేషాలని నిర్మూలించడమూ దాని ప్రతి అంశానికీ ప్రత్నామ్నాయ హైందవ భావనల కల్పన చేయడమూ.

ఆ తర్వాత బ్రాహ్మణాధునికత అనే ఒక సంధి దశ కొంతకాలం ఉండి, అది ఒత్తిడులకి గురై విశాలమై కమ్యూనిస్టు రకం ఆధునికతగా మారింది.

దీనిలో బ్రాహ్మణ, బ్రాహ్మణీయ కులాలు ఇతర బ్రాహ్మణేతర అగ్రవర్ణాలని కలుపుకురావడం మొదటి దశ.

ఈ ఇతర అగ్రవర్ణాల పెత్తనం కింది బ్రాహ్మణ సాహిత్య మేధో పురోగాములు కనిష్ట ప్రాధాన్యతగల సాంస్కృతిక మేధో విభాగానికి పరిమితం కావడం రెండో దశ.

ఇక్కడ జరిగిన విడ్డూరం ఏమంటే పెట్టుబడి అనుకూల విలువల సాయంతో తెలుగు కమ్యూనిజం, తెలుగు బ్రాహ్మణిజం చేయికలిపి, క్రైస్తవ, కమ్యూనిస్టు స్ఫూర్తికి వ్యతిరేకంగా పోరాడి తెలుగు సాహిత్య మేధోరంగాలని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నాయి.

రెండు వైపులా కమ్యూనిస్టు అనే మాట ఉందనే విషయాన్ని గమనించాలి. భావంగా విరోధాభాసలా ఉన్నా ఆచరణలో కమ్యూనిజమే కేపిటలిస్టు కేంద్ర విలువలని విద్యావంతుల సంస్కారంలో ప్రవేశపెట్టింది ప్రతిష్టించింది.

మనకి మొదట్లో కనిపించినంత విడ్డూరం ఇందులో ఏమీలేదు. చైనాను చూసినా తెలుస్తుంది.

ఎక్కువ వాణిజ్య విలువలు ప్రభావం చూపే కళా మేధో తదితర రంగాలలో సంస్థాపక పాత్రగానీ (సిన్మారంగం, ప్రచురణ రంగం) ప్రాబల్య పాత్ర గానీ (ఆర్ధిక శాస్త్రం, ప్రణాళికా, వైధానిక రంగాలూ, ప్రైవేటు ఉన్నత విద్య) ఇప్పటికీ కమ్యూనిస్టులదే.

జీవితంలోని అన్నిరంగాలలోనూ అడుగడుగునా లెక్కలు, అంచనాలు, లాభనష్టాల బేరీజు, ప్రతిదీ ప్రయోజన దృష్టితో చూసే అలవాటు కమ్యూనిస్టుల్లోనే ఎక్కువని అందరికీ తెలుసు.

ఈ కమ్యూనిస్టు వ్యాపార పాటవమూ బ్రాహ్మణీయ పంపక వ్యతిరేక మనోభావమూ కలిసి లేదా మూడింటినీ వాదాలుగా పేర్కొంటే కమ్యూనిజం కేపిటలిజం బ్రాహ్మణిజం కలగలిసి ఇప్పటి పరిస్థితిని నెలకొల్పాయి.

వాటికి పుస్తకం ప్రతీక కాదు. సాకారరూపం. బడి. వ్యాయామ శాల. శిక్షణా శిబిరం.

పుస్తక నాశనం అనివార్యం

e-book

ఈ ‘పుస్తకం’ నశించాలి. రాజ్యం లాగ మతం లాగ కుటుంబం లాగ పల్లె పట్టణాల తేడా లాగ పుస్తకం కూడా నశించిపోవాలి. అదృశ్యమైపోవాలి.

అంటే నిషేధించడమో నిర్మూలించడమో కాదు, అనవసరమైపోవాలి.

అంతకాలం అది చేసిన పని అనవసరం కావడమో అంతకన్నా మెరుగ్గా మరేదో ఆ పని చేయడమో జరగాలి. ఎడ్లబండి లాంటి పుస్తకాన్ని వదిలేసుకోవాలి.

అది వాచీల వలె అలంకారంగా ఆభరణంగా మారిపోవాలి. లేదా మ్యూజియాలలోకి చేరాలి.

ఈ పుస్తక నాశనం అనివార్యం. ఇప్పటికే ఇది మొదలైంది. అది చాలా వేగంగా జరుగుతోంది.

నిన్న పుస్తకాల గురించి కొందరు కొన్ని చక్కని విషయాలు చెప్పారు. పుస్తకం (book) అంటే వాచకమే (text) అనే ధోరణిలో రాశారు. కొందరు పుస్తకాల గురించి రాస్తున్న నెపంతో చదవడం (reading) గురించి రాశారు.

అత్యధికులు పుస్తకం అంటే ఇంకా కాగితాల పుస్తకమే (hard copy) అన్నట్లుగా రాశారు. మంచి ఫోటోలు కూడా పెట్టారు.

ఈ- పుస్తకపు (e-book) స్క్రీన్ షాట్ లేదా ఫొటో ఎవరూ పెట్టలేదు.

ఇప్పుడు కూడా కాగితపు పుటలు ఉండే పాతరకం పుస్తకాలే ఇంకా పుస్తకాలంటే అనే ధోరణిలో వుంది వీరి తీరు.

దీనికి కారణం మారిపోయిన వాస్తవాన్ని గుర్తించకపోవడం కావచ్చు. గుర్తించ నిరాకరించడం కావచ్చు. పనిగట్టుకుని దాచిపెట్టడం కావచ్చు. బుకాయించడం కావచ్చు.

నిజంగా ఈ రాసినవాళ్లందరూ రెండు దశాబ్దాల కిందటి ప్రపంచంలోనే మారకుండా ఉండిపోయిన విడ్డూరం కావచ్చు.

కొందరి రాతల్ని చూస్తే అవి చిన్నప్పటి అలవాట్లని ఇప్పటికీ పాటిస్తున్నట్టుగా  అనుమానం వస్తుంది.

కొందరు అప్పుడే చెట్టునుంచి విరిచిన పందుంపుల్లతో మాత్రమే ఇప్పటికీ పళ్లు తోముకుంటున్నట్టు, ఈ రోజుకూ కుంకుడుకాయలని రోకట్లో కొట్టుకుని తలంటుకుంటున్నట్టు, (ఇప్పటికీ) పుస్తకాలని వాడుతూ ఉండొచ్చు.

కాలం చెల్లిన టెక్నాలజీ

కానీ సమకాలీన సాధారణ జీవితాలు గడుపుతూ అన్నివేళలా అలా చేస్తూవుంటే, చేయగలిగితే, అది చాలా విచిత్రమే.

కాలం రెండు దశాబ్దాల క్రితం వీళ్ల విషయం వరకూ గడ్డకట్టుకుపోయి అక్కడే నిలిచిపోయినట్టుంది.

పుస్తకం అనేది ఒక సంకేతిక పరికరం. ఆ టెక్నాలజీకి కాలం చెల్లింది.

అలవాటు పడడం వలన ఇప్పుడు బతికున్న మూడుతరాలలో మొదటి రెండు తరాలూ ఇంకా కాయితాల పుస్తకాన్ని వాడుతూనే ఉంటారు.

కానీ దీని వాడకం బాగా తగ్గిపోతోంది. ముందుముందు అదృశ్యంకాకపోవచ్చు. తిరగలి, నాగలి వంటి పరికరాల లాగా పుస్తకం కూడా పూర్తిగా మాయమవ్వకపోవచ్చు.

పుస్తకం ఇంకా ఫ్లాపీ పరిస్థితికి చేరుకోలేదు. బహుశా ఆ పరిస్థితి సమీప భవిష్యత్తులో రాకపోవచ్చు.

కానీ కనీసం డిస్క్ లాగా మారింది. ఇప్పటికీ వాడొచ్చు. కొంతమంది వాడతారు. చాలా తక్కువ మంది వాడతారు. అరుదుగా వాడతారు. అందరూ దానిని తమాషా అయిన అలవాటుగా చూస్తారు.

ఎందుకంటే పుస్తకం అనే గుడ్డును బద్దలుకొట్టుకుని వాచకం అనే కోడిపిల్ల బయటపడింది. మళ్లీ ఆ గుడ్డు డొల్లలోకి ఈ కోడిపిల్ల పోనేపోదు.

నిన్న పుస్తక దినం గురించి రాసిన వాటిల్లో చాలా వరకూ ఆ డొల్ల అందాల గురించే ఆకట్టుకునే మాటలు చెప్పారు. వీరి ప్రకారం ఇంకా డొల్లలోనే ఆ కోడిపిల్ల ఉన్నట్టుంది. 

ఇటీవలి కాలం వరకూ పుస్తకం అనే మాటకి దాని భౌతికరూపం, కాగితం, అట్ట, ఇంకు వగైరాలతో పాటూ దానిలో ఉన్న వాచకం అని కూడా అర్థం. వస్తు రూపాలు కలిసి ఉండేవి దంపతీ వివాహం (మోనోగమీ) లాగా.

అంతే కాదు, అవి రెండూ విడివడిగా ఉండే అవకాశం, ఒకసారైనా విడిపడే అవకాశం, అసలే ఉండేది కాదు.

అసలు, ఆ మాటకొస్తే (కాగితపు) పుస్తకం విషయంలో, రూపమే వస్తువని కూడా అనొచ్చు.

సంప్రదాయ పరిస్థితులలో భార్యకి దాంపత్యంలాగా, పిల్లలకి కుటుంబంలాగా, వాచకం ఇటీవలి కాలం వరకూ (కనీసం ఫొటో కాపీయింగు వచ్చేవరకూ) పుస్తకం అనే చెరశాలలో బందీ.

అయితే, పుస్తకం వాచకానికి వేదిక కూడా. వాచకం పుట్టడానికీ మనడానికీ పుస్తకమే సాధ్యమైన, ఊహించగల మార్గం.

కొందరు స్వార్థపరుల లేదా చాదస్తుల వరకూ వస్తే అసలు పుస్తకమూ దాని సొంతదారుడూ కూడా కలిసే ఉండేవారు. వాటిని విడదీయడం సాధ్యమయేది కాదు.

సర్వాంతర్యామి కావాలి

కానీ, పుస్తకంలో ఉన్న ప్రధానలోపం, లేదా పరిమితి ఏమంటే అది ఒకచోట మాత్రమే ఉండగలదు.

ఒకేసారి అనేక చోట్ల ఉండలేదు. దైవంలాగా. రేడియో టీవీ ప్రసారాల్లాగా, మొబైల్ సిగ్నల్ లాగా ఈ-బుక్ లాగా అది సర్వాంతర్యామి కాదు.

ఆరకంగా పుస్తకం అనే టెక్నాలజీ కమ్యూనిజానికి సరిపోదు. పంచుకుంటే తరగని స్వభావం దానిలో లేదు. ఇప్పుడు పుస్తకం నుంచి వాచకం విముక్తి పొందింది.

ఇవ్వడం వలన కోల్పోవడం అనేది పోయి కమ్యూనిజాన్ని ఆవాహన చేయగల వాహికా వేదికా కాగల యోగ్యతని వాచకం సమకూర్చుకుంది.

వాచకం కూడా డబ్బులాగే కాయితం రూపంలో ఉండాల్సిన అవసరం లేకపోవడం వలన సౌకర్యం పెరిగింది. దానిని చరిత్ర పొడుగునా వెంటాడుతూ ఉండే అపాయాలు మాయమైపోయాయి.

జేబు కొట్టడం లాగే పుస్తకాలని కాజేయడం కూడా అరుదైపోయింది.

పారేసుకోవడం, కాలిపోవడం, తడిసిపోవడం, పసిపిల్లల చేతిలో పడి పాడైపోవడం, చెదలు పట్టడం, ఎలుకలు కొట్టేయడం లాంటి చిక్కులనించి పూర్తి విముక్తి కలిగింది.

ఇక వాచకానికి మరణం లేదు. అది నశించదు. అది అమరం. మత గురువుల, విప్లవకారుల అమరత్వంలా అలంకారిక అమరత్వం కాదు. దేవతల తరహా అమరత్వం. అదికూడా కాల్పనికమే కనుక వైరస్ తరహా అమరత్వం అనొచ్చు.

ఇక ప్రచురించదలచీ ప్రచురించలేకపోయిన రచనలేవీ ఉండవు.

మహాకవుల మహా పంక్తులేకాదు ఎవరు రాసిన ఏ చెత్తయినా సరే శాశ్వతంగా ఉంటాయి. వాటిని మరచిపోవచ్చును. ఎవరూ వెతక్క పోవచ్చును. చివరికి రాసినవాళ్లు కూడా పట్టించుకోకపోవచ్చును.

కానీ అవి శాశ్వతంగా ఉండిపోతాయి. ఎప్పటికైనా ఎవరైనా వాటిని వెలికి తీయవచ్చును.

తాళ పత్ర గ్రంథాలని కొంతమందైనా చూసివుంటారు. ఇవన్నీ ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత రాసినవే.

ఇప్పుడు కాయితాల పుస్తకాలని ప్రచురించేవారూ, కొనుక్కునేవారూ, చదివేవారూ అలాంటివాళ్లే. ఇప్పటికీ చేత్తో రాసేవాళ్లున్నట్టు, ఇప్పటికీ కాయితాల పుస్తకాలని చదివేవాళ్లున్నారు.

కానీ పుస్తకాల చదువరులలో అత్యధికులు కాయితాల పుస్తకాలని చదివేది ఎక్కువకాలం ఉండదు.

వాచకాలలో ఇకపై కాయితాలతో చేసిన పుస్తకంగా ప్రచురింపబడేది అతి తక్కువ శాతమే. ఈ-పుస్తకాల, ఆడియో పుస్తకాలదే భవిష్యత్తు. ఇప్పటికే మనజీవితాలో చదివేది ఎక్కువగా ఈ-వాచకమే.

సంకెళ్లు తెంచుకున్న వాచకం

పుస్తకం వాచకం వేరువేరు అయినాయి. మనసులో కాదు. బయట కూడా.

ఇప్పుడు వాచకం పుస్తక రూపంలో ఉండొచ్చు. డిజిటల్ రూపంలో వుండొచ్చు. శ్రవణ రూపంలోనూ ఉండొచ్చు. వాచకం ఎప్పుడూ ఉంటుంది.

వాచకానికి కాయితాల పుస్తకం ఒకటే రూపం అయ్యే పరిస్థితి మారిపోవడం మానవ నాగరికతలో గొప్ప మార్పు.

ప్రింటింగ్ ప్రెస్ కనుక్కోవడం ఆ రోజుల్లో ఎలానో ఈ రోజుల్లో కాయితాల పుస్తకం మాత్రమే పుస్తకం కాకపోవడం అలాంటి విప్లవం.

పుస్తకం ఉన్నంత కాలం ఉన్నత సంస్కృతీ సమాచారం సాహిత్యం జ్ఞానం అనేవి వనరులు వాటివల్ల వచ్చే ప్రతిష్టా ఉపాధీ పలుకుబడీ పరిచయాలూ వాటివలన కలిగే మేలూ ఉన్నవాళ్ల గుప్పిట్లోనే ఉండి పోతాయి.

పుస్తకం ఉన్నంత కాలం అది సొంత ఆస్తిగానే ఉంటుంది. గ్రంథాలయాలలో కూడా అది అందరికీ అందుబాటులోనే ఉంటుంది గానీ ఆస్తిగానే ఉంటుంది.

ఆస్తిగా మారిన అంశాలు త్వరలో మార్పిడి చేసుకునే లెక్కలకి దారితీస్తాయి.

ఆ తర్వాత వాటిని సరుకుగా మార్చడానికి చరిత్రలో చాలాకాలం పట్టింది గానీ ఇప్పటికే మూలమూలలకీ ఇంకిపోయిన పెట్టుబడిదారీ స్ఫూర్తివలన నిరంతరం ఊదరపెట్టే కన్నుకుట్టే స్ఫూర్తిదాయక వ్యాపార విజయాల అవకాశాల జీవిత కథల వలన ఆస్తిగా ఉన్నది సరుకుగా మారడానికి ఈ కాలంలో అట్టేకాలం పట్టదు. పట్టలేదు.

మన తెలుగు విద్యావంతుల సంస్కారంలో మనసుల్లో పెట్టుబడిదారీ స్ఫూర్తిని ప్రవేశపెట్టడమే కాదు వాటిని సహజమని నమ్మించి నిలిపిన ఎర పుస్తకం.

ఆ పుస్తకమూ ఈ పుస్తకమూ కాదు. పుస్తకమే. ఏ పుస్తకమైనా.

ఆ నిర్దిష్ట అర్థంలో తెలుగు వాళ్ల చేతుల్లో ఉన్న ఏ పుస్తకమైనా, చివరికి కమ్యూనిస్టు మానిఫెస్టో అయినా సరే, ఐన్రాండ్ భావాలనే ప్రచారం చేస్తుంది.

ఒకేసారి ప్రపంచమంతా అందుబాటులోకి

ఇప్పుడు ఆ పుస్తకం కమ్యూనిజానికి సరిపడా స్వభావాన్ని సంతరించుకుంది. ఇప్పుడు ఏ పుస్తకమైనా ఒకేసారి ప్రపంచమంతటికీ అందుబాటులోకి తేవచ్చు. దీనివలన అదనపు శ్రమ ఏమీ వ్యయంకాదు.

నిజానికి, పెట్టుబడిదారీ విధానం వలన వాటికి ధరలూ పాస్వర్డులూ డీయారెమ్‌లూ వంటి బోలెడంత శ్రమ ఖర్చవుతుంది.

కమ్యూనిస్టు పదజాలంలో చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే కమ్యూనిస్టు వ్యవస్థకి సరిపడిన పరికరాలు పుట్టాయి. వాలెన్సీని పెంచుకున్న పరికరాలలో వాచకం ఒకటి.

కానీ, దాని ప్రచురణా పంపకమూ రాసిన వారికి వాటి అమ్మకాల ద్వారానే జీవిక రావడమూ వంటి పెట్టుబడిదారీ లక్షణాల వలన వాటి పంపకానికి పరిమితులు వస్తున్నాయి.

తెలుగు సమాజంలో పెట్టుబడిదారీ విలువలకి పట్టుగొమ్మా పాఠశాలా అయిన పుస్తకం ఇప్పుడు ఎలక్ట్రానిక్ రూపం సంతరించుకుని కమ్యూనిజానికి తయారుగా ఉండటం ఒకటే కాదు.

ఇంకా విద్యా వైజ్ఞానిక సాంసృతిక పరిశోధనా రంగాలలో మిగిలివుండిన బ్రాహ్మణిజాన్ని బద్దలు కొట్టేసింది.

ఈ-వాచకం వచ్చాక స్వంతంగా చదువుకోవడం ఎవరు ఎక్కడినుంచైనా చదువులో శిక్షణలో సహకరించుకోవడం బోధించడం సాయపడటం సలహా ఇవ్వడం సాధ్యం.

ఆ పని ఎవరైనా చేయొచ్చును. ఎక్కడి నుంచైనా చేయొచ్చును.

అందుకే బ్రాహ్మణీయ శక్తులన్నీ ఏకమై ముఖాముఖీ విద్యలేకపోతే ప్రమాణాలు పడిపోతాయని పెద్దఎత్తున గొగ్గోలు పెడుతున్నారు ఈ మధ్య.

ప్రమాణాల గురించి పేదరికం గురించి వారు వాదనలు చేస్తున్నా (అవి అన్నీ అబద్ధాలే, అతార్కికాలే) ‘ఫ్రీ వాచకం’, రెండు అర్థాలలోనూ తీసుకోవాలి దీన్ని, బ్రాహ్మణిజం అవశేషాలని పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది.

ఉచితం అయిన వాచకం, స్థల కాల ధర పరిమితులు లేని ఈ-వాచకం జానానికి చిట్టచివరి సంకెళ్లని, గురువూ, స్థలమూ, సమయం, కులమూ అనే విద్యా నిర్ణాయకాలని మూలమట్టంగా మార్చేస్తుంది.

యాదృచ్ఛికంగా ఎవరూ ఆశించకుండానే కలిగిన ప్రయోజనం ఏమంటే ఇప్పటికే క్లాసిక్ పుస్తకాలు ఉచితంగా దొరుకుతున్నాయి. కనీసం కొన్ని భాషల్లో.

ఆడియో పుస్తకాలు

అన్నిరకాల వాచక శ్రవణ రూపాల్లోనూ ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. కావలసిందంతా ఫోనూ, బేటరీ, స్టోరేజీ లేదా సిగ్నలూ.

ఆడియో పుస్తకాల వలన కదులుతున్నప్పుడు కూడా పుస్తకం చదవగల మహత్తర అవకాశం మానవజాతికి ఒనగూడింది.

చరిత్ర పొడుగునా ఉండిన గురువుల, సంస్థల అవసరం చదువులో త్వరలో మాయమైపోతుంది. కనీసం వారి వాటి పాత్ర గుణాత్మకంగా మారిపోతుంది. 

ఇంట్యూటివ్ టెక్నాలజీ లాగానే సెల్ఫ్ డైరెక్టెడ్ చదువూ సొంతంగా చదువుకోవడమూ (బోధనారహిత విద్య, ఆటోడైడాక్టిసిజం) ఇంతకుముందులాగా అరుదైన విశేషాలుగా ఉండవు.

అవి ప్రధాన స్రవంతి ఆచరణగా మారడానికి అట్టేకాలం పట్టదు.

ఇప్పుడు అందరూ చదివేది అత్యధికంగా ఈ-వాచకాన్ని. ఆ తర్వాత పుస్తకాలు కూడా ఈ-రూపంలోనే – ఎలక్ట్రానిక్ రూపంలోనే – ఎక్కువగా చదువుతున్నారు.

కాబట్టి కాగితం పుస్తకాలు త్వరలో అప్రధానమైపోతుంది. ఇది బ్రాహ్మణిజపు సమాధిలో దిగ్గొట్టిన చివరి మేకు.

ఆ బ్రాహ్మణ కులంలో పుట్టి, కులాచారంలోనే పెరిగి ఇరుక్కున్న వాళ్లతో సహా అందరికీ విముక్తికి అవకాశం వచ్చింది.

ఆ సాంప్రదాయం చదువు జ్ఞానం సాహిత్యంలో మంచిని మిగుల్చుకుని దానిని అందరికీ పంచి ఆ అడ్డంకినీ మూఢత్వాన్నీ అమానుషత్వాన్నీ మాత్రమే సమాధి చేసే అవకాశం వచ్చింది.

దానితో చేతులు కలిపిన కమ్యూనిజం ఇక వారిని వీడక తప్పని స్థితి వచ్చింది.

వ్యవస్థను మార్చొద్దా? రాజ్యాన్ని కూల్చొద్దా?

పుస్తకం అందరికీ అందుబాటులో ఉన్నంత మాత్రాన కమ్యూనిజం వచ్చేస్తుందా? ఆర్థిక వ్యవస్థను మార్చొద్దా? రాజ్యాన్ని కూల్చొద్దా? అనే ప్రశ్న వస్తుంది.

ఇప్పుడు ప్రపంచంలో విప్లవానికి అడ్డుతగులుతున్న పరిస్థితుల్లో ప్రధానమైనది కమ్యూనిజం ఉన్నత విద్యావంతుల సొత్తుగా మాత్రమే ఉండటం.

ఉన్నత విద్యా సంస్థల్లో ఉన్నవారికి మాత్రమే కమ్యూనిజం పరిమితమై ఉన్నది. సంస్థలు, గురువుల చేతుల్లో ఉన్నది.

కమ్యూనిజం కేవలం సిద్ధాంతంగా మిగిలిపోయింది కానీ ఆచరణగా మారటం లేదు. వారి వ్యక్తిగత జీవన విధానంలో నైతిక విలువల రూపం తీసుకుంటోంది తప్ప వాస్తవ జీవితంలో వ్యవస్థను మార్చే విప్లవ కార్యాచరణ రూపం తీసుకోవటం లేదు.

అందుకే ఉన్నత తరగతుల వాళ్లు వామపక్షాన్ని, కింది తరగతుల వాళ్లు వేరే రకాల రాజకీయాలను ఆదరిస్తున్నారు అనుసరిస్తున్నారు. ఈ సమీకాలీన అసంబద్ధత నుంచి లోకం బయటపడాలి.

సార్వత్రిక ఉన్నత విద్య వచ్చినపుడు మాత్రమే అది సాధ్యం.

కానీ అన్ని దేశాల లోనూ అందరికీ అందుబాటులో ఉండే ఉన్నత విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేయటం సాధ్యం కాదు గనుక ప్రచురించిన ప్రతి పుస్తకమూ అందరికీ అందుబాటులో ఉండే పరిస్థితులు రావాలి.

ఆ పరిస్థితులు రావాలంటే పుస్తకం నశించాలి. ఈ-పుస్తకం వర్థిల్లాలి.

పుస్తకానికి వీడ్కోలు. బ్రాహ్మణిజానికి ఛీ పో. కమ్యూనిజానికి ఆహ్వానం.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.)

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe