Mothers Day: అమ్మ మీద ప్రేమను చూపించే రోజు వచ్చేనా?

“ప్రేమకు రుజువు ఏముంటుంది? ప్రేమించడం తప్ప.”

ముల్క్ (2018 హిందీ) సినిమా చూసిన వారికి ఈ మాట గుర్తుండే ఉంటుంది.

పెళ్లయిన కొత్తలో, తనపై ప్రేమను నిరూపించుకోవాలని భార్య తరచుగా గొడవపడేదని కోడలు ఆరతి (తాప్సీ)కి చెబుతూ మురాద్ అలీ మొహమ్మద్ (రిషీ కపూర్) ఆ మాట అంటాడు.

మురాద్ అలీ మరీ పాత కాలపు మనిషి.

భార్య మీద ప్రేమనేకే కాదు, తాత, అమ్మమ్మ, నానమ్మ, తల్లి, తండ్రి, అన్నాదమ్మలు, అక్కాచెల్లెళ్లు, సొంత పిల్లల మీద ప్రేమనైనా, చివరికి పెంచుంటున్న కుక్కపిల్ల మీది ప్రేమనైనా అతి సునాయసంగా రుజువు చేసేసుకోవచ్చు.

ప్రతి మనిషికీ ఓ పేరున్నట్టే, ప్రతి ప్రేమకు, అనుబంధానికి ఓ రోజుంది. ఆ రోజున ఆ ప్రేమను ఆ వ్యక్తిపై మన ప్రమేయం లేకుండానే కురిపించేసే సాంకేతిక సౌలభ్యం ఉంది.

స్తోమతను బట్టి కానుకల తరాజులో పెట్టి ప్రేమను విలువకట్టి మరీ అందించేయగల సౌకర్యం ఉంది.

Ann Maria

అమెరికా, భారత్‌లు సహా 40కి పైగా దేశాలు ప్రతి ఏడాది మే నెల రెండవ ఆదివారాన్ని “మదర్స్ డే”! గా పాటిస్తున్నాయి. ఇతర దేశాలకు వేరు వేరు తేదీలు ఉన్నాయి.

Mothers Day ఎందరు తల్లులకు పండుగో కాదో గానీ, ఆన్‌లైన్ వ్యాపార సంస్థలకు మాత్రం ఇది కూడా మరో పెద్ద పండుగ! మీ స్తోమతను బట్టి మీకు ఉండదగినంత తల్లి మీద ప్రేమకు తగ్గ కానుకల జాబితాను మీ ముందుంచేసి, ఓ రెండు క్లిక్‌లతో మీ ప్రేమను అమ్మకు అందించేస్తాయి.

ఇక అమ్మను, అమ్మ మీద ప్రేమను వ్యక్తం చేయాల్సిన అవసరాన్ని, అసలు మదర్స్‌ డే నే  మరిచిపోయి మీరు మీ రొటీన్ జీవితాన్ని ఏ చికాకూ లేకుండా గడిపేయవచ్చు.

ఏటా జరగాల్సిన ఈ తంతు దానికదే ముగిసిపోతుంది. అమ్మ ప్రేమకు తగ్గ పారితోషికం దక్కిపోతుంది!

ఇక అమ్మల పాట్లు అమ్మలకు ఎప్పుడూ ఉండేవేగా! అది వాళ్ల తలరాత, ఎవరు మార్చగలరు?

Mothers Day ను ఎవరు, ఎప్పుడు, ఎందుకు ప్రారంభించారు?
Mothers Day

వాట్సాప్ సందేశాలను పంపేసి చేతులు దులుపుకునే వారిలో, వాటిని చూసి మురిసిపోయే తల్లులలో ఎంతో మందికి ఆన్ మరియా రీవ్స్ జార్విస్ (1832-1905) అంటే ఎవరో తెలియకపోవచ్చు.

ఆమే తెలియకపోతే ఆమె వర్ధంతి రోజైన మే రెండవ ఆదివారమే Mothers Day అని అసలే తెలియకపోవచ్చు.

ఆన్.. అమెరికా అంతర్యుద్ధ కాలంలో గాయపడ్డ ఇరు పక్షాల సైనికులకు సేవలు చేసిన శాంతి కార్యకర్త, సంఘ సేవకురాలు.

కుటుంబంలో తల్లికి దక్కాల్సిన గౌరవ దక్కడం లేదనే చింత ఆమెను వేధించేది.

ఇంటిల్లిపాదికి అలుపెరగకుండా సేవలు చేసే తల్లుల పట్ల ఎవరో కాదు సొంత కటుంబ సభ్యులే మన్నన చూపడానికి ఓ సెలపు రోజు ఉండాలనేది ఆమె కల.

Anna Maria

ఆమె మరణానంతరం ఆ కలను సాకారం చేయాలని నడుం బిగించినది ఆమె రెండో కుమార్తె అన్నా మరియా జార్విస్.

1908లో మొదటిసారిగా వెస్ట్ వర్జీనియాలోని ఆండ్రూస్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో అన్నా“ఒక తల్లి తన కుటుంబానికి చేసిన సేవ”కు గౌరవ సూచకంగా అధికారికంగా జరిపిన మొట్టమొదటి “మదర్స్ డే”.

ఆ తర్వాతి రెండేళ్లు దానిని అధికారికంగా అమెరికా దేశవ్యాప్తమైన మదర్స్ డేను చేయాలని ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు.

ఇక మదర్ ఇన్ లా డే, ఫాదర్ ఇన్ లా డేలను కూడా ఏర్పాటు చేయక తప్పదనే వెక్కిరింతలు, హేళనలు సహజంగానే ఎదురయ్యాయి.

అయినా వర్జీనియా, తదితర రాష్ట్రాలు, ప్రాంతాలలో ప్రభుత్వాల ప్రమేయం లేకుండానే మదర్స్ డేను పాటించసాగాయి.

చిట్టచివరకు 1914లో అధ్యక్షడు వుడ్రో విల్సన్ హయాంలో మే రెండవ ఆదివారం దేశవ్యాప్త మదర్స్ డే అధికారికంగా సెలవు దినంగా మారింది.

అన్నా మరియాకు మదర్ ఆఫ్ మదర్స్ డే గా, వెస్ట్ వర్జీనియా ఆండ్రూస్ చర్చికి ఇంటర్నేషనల్ మదర్స్ డే ష్రైన్‌ గా గుర్తింపు వచ్చింది.

Mothers Day

మదర్స్ డేను రద్దు చేయాలని ఉద్యమించిన మదర్ ఆప్ మదర్స్ డే!

“అచ్చు వేసిన కార్డ్ అంటే, ప్రపంచంలో మరెవరి కన్నామీ కోసం ఎక్కువ సేవలు చేసిన మహిళకు మీ చేతులతో మీరు రాయడానికి కూడా బద్ధకించే సోమరిపోతు అని అర్థం” – మదర్ ఆఫ్ మదర్స్ డే అన్నా మరియా

తల్లి కలను సాకారం చేశానన్న సంతృప్తి అన్నాకు ఎంతో కాలం దక్కలేదు.

గ్రీటింగ్ కార్డ్‌లు, రోజా పూల గుచ్చాలు, బహుమతుల వ్యాపారం మరుగునపడి మదర్స్ డే అసలు ఉద్దేశమే కనుమరుగైపోయిందని అన్నా కలత చెందింది.

తల్లుల సేవల స్మారక దినం స్ఫూర్తిని వ్యాపారీకరణ నుంచి కాపాడాలని విఫల ప్రయత్నాలు చేసింది. వ్యాపారీకరణకు ఎదురొడ్డి నిలవగల వారు ఎవరు?

ఇక మదర్స్ డేను రద్దు చేయించాలని కోరుతూ కాళ్లరిగేలా తిరిగింది. గ్రీటింగ్ కార్డ్‌ల కంపెనీలు మదర్స్ డేతో లాభాల పంట పండించుకుంటుంటే, మదర్ ఆఫ్ మదర్స్ డే బికారిగా మారింది.

చివరికి 1943 నాటికి బతకలేక సోదరి లిల్లీ పంచన చేరింది. ఎనభై ఏళ్ల పండుటాకుగా కూడా  పట్టువదలకుండా మదర్స్ డే రద్దు కోసం శ్రమిస్తూనే వచ్చింది.

గ్రీటింగ్ కార్డ్‌లు, ప్లవర్ బొకేల వ్యాపారుల సంస్థలు ఓ వృద్దాశ్రమంలో చేర్చి ఆ పిచ్చిదాని పీడ విరగడ చేసుకోవడమే కాదు, అతి ఉదారంగా ఖర్చులు కూడా భరించారు.

1948 నవంబర్ 24న మదర్ ఆఫ్ మదర్స్ డే తుది శ్వాస విడిచింది.

ఇక వ్యాపారీకరణ విష కౌగిలికి చేరిన మదర్స్ డే నిర్విఘ్నంగా అంతర్జాతీయ దినంగా మారి ప్రతి అందమైన అనుబంధాన్ని, సున్నతమైన ప్రేమ బంధాన్ని వ్యక్తిగత ఉద్వేగాలకు అతీతమైన యాంత్రిక బంధంగా మార్చింది, మార్చేస్తోంది.

సోమరితనం వీడి అమ్మపై ప్రేమను రుజువు చేసుకోవడానికి బదలు ప్రేమను చూపించే రోజు ఎప్పటికైనా వస్తుందా?

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe