Women’s Day చరిత్ర ఇదీ – అమెరికాలో ఆరంభం, రష్యాలో విప్లవం

నూట పదమూడు ఏళ్లైంది. మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించి. అది 1911 మార్చిలో. అది కూడా అమెరికాలో.

మహిళా దినోత్సవం పుట్టుక మూలాలు కార్మికోద్యమంలో ఉన్నాయి. అమెరికాలో మొదలైన మహిళా దినోత్సవం.. 1917లో రష్యాలో కార్మిక మహిళల ఉద్యమాలను పతాక స్థాయికి తీసుకెళ్లింది.

2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శతవార్షికోత్సవం జరిగింది. ఈ ఏడాది 113వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం.

సమాజంలో, రాజకీయాల్లో, ఆర్థికరంగంలో, సంస్కృతిలో మహిళల స్థాయి ఎంత వరకూ మెరుగుపడింది? మరింత సమానత్వం సాధించటం ఎలా?

అనే అంశాలపై చర్చించుకోవటానికి, కార్యాచరణను నిర్దేశించుకోవటానికి, అవగాహనను పెంపొందించటానికి, సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకోవటానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక వేదికగా మారింది.

చాలా దేశాల్లో Women’s Day అధికారికంగా సెలవు రోజు కూడా.

అమెరికాలో మొదలైన Women’s Day

women's day
1908లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మహిళా కార్మికులు సమ్మెకు దిగారు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మూలాలు ఇరవయ్యో శతాబ్దపు సోషలిస్టు ఉద్యమాల్లో ఉన్నాయి.

అమెరికాలో పారిశ్రామిక రంగం విస్తరిస్తున్న కాలమది. న్యూయార్క్ నగరంలో వేలాది మంది మహిళలు వస్త్ర పరిశ్రమల్లో పనిచేసేవారు.

అప్పడు వారి వేతనాలు నామమాత్రంగా ఉండేవి. లైంగిక వేధింపులు తీవ్రంగా ఉండేవి.

ఈ సమస్యల పరిష్కారం కోసం 1908 ఫిబ్రవరిలో న్యూయార్క్ నగరంలో వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే వేలాది మహిళలు సమ్మెకు దిగారు.

దాదాపు 15,000 మంది మహిళా కార్మికులు.. పని గంటలు తగ్గించాలని, జీతాలు పెంచాలని, తమకూ ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్లతో ఆ మహా నగరంలో ఊరేగింపులు తీశారు.

ఆ సమ్మెలు, ఆందోళనలు ఏడాది పాటు కొనసాగాయి. దానికి గుర్తుగా సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా 1909 ఫిబ్రవరి 28న తొలిసారి జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించింది.

International Women’s Day గా ఎలా మారిందంటే

women's day
క్లారా జెట్కిన్, రోసా లక్షెంబర్గ్ 1910లో

అమెరికా మహిళల ఉద్యమం సార్వజనీన ఓటు హక్కును డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ ఉద్యమంగా మారింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం పోరాడింది కమ్యూనిస్టు కార్యకర్త క్లారా జెట్కిన్ (Clara Zetkin). ఆమె జర్మనీకి చెందిన ఉద్యమకారిణి, సోషలిస్టు నాయకురాలు.

1910లో కోపెన్‌హాగన్‌లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమన్ జరిగింది. మొత్తం 17 దేశాల నుంచి 100 మంది మహిళలు ఆ సదస్సుకు హాజరయ్యారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచనను ఆ సదస్సు ముందుంచారు క్లారా జెట్కిన్. సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఆమె కృషి ఫలితంగా 1910వ దశకం తొలి నాళ్లలో యూరప్ వ్యాప్తంగా Women’s Day గుర్తింపు పొందింది.

రష్యాలో Women’s Day విప్లవం

1917 international women's day in russia
రష్యాలో 1917 మహిళా దినోత్సవం నాడు మొదలైన మహిళా కార్మికుల నిరసనలతో జార్ పాలన అంతం ఆరంభమైంది

అమెరికాలో మొదలైన మహిళా దినోత్సవం రష్యాకు కూడా చేరింది. ఆ దేశంలో 1913లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు.

ఆ సమయంలో రష్యాలో ఇతర కారణాల రీత్యా కూడా అలజడి చెలరేగుతోంది. యుద్ధంతో దేశం అతలాకుతలమైంది. ఆహార కొరత ప్రజలను వేధిస్తోంది. జనంలో నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి.

ఈ నేపథ్యంలో 1917 ఫిబ్రవరి 23న  (రష్యా జూలియన్ కేలండర్‌లో ఈ రోజు మార్చి 8వ తేదీకి సమానమైన రోజు) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

అప్పటి రష్యా రాజధాని పెట్రోగ్రాడ్‌లో జరిగిన ఈ ప్రదర్శనలో 40,000 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. ‘ఆహారం, శాంతి’ కోసం నినదించారు.

ఈ నిరసనలు అంతకుముందలి మహిళా దినోత్సవ ప్రదర్శనల కన్నా చాలా భిన్నంగా సాగాయి.

నిజానికి రష్యా విప్లవ నాయకత్వం ఈ మహిళా కార్మిక ప్రదర్శనల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మిక దినోత్సవమైన మే 1వ తేదీ వరకూ ప్రదర్శనలు ఆగాలన్నది వారి ఆలోచన.

రష్యా సామ్రాజ్య పతనానికి నాంది

women's day
మహిళల ఓటు హక్కు కోసం జర్మనీలోనూ ఉద్యమించారు, ఈ పోస్టర్‌ను జర్మనీ నిషేధించింది

అయితే, విప్లవ నాయకుల మార్గదర్శకాలకు విరుద్ధంగా మహిళా దినోత్సవం నాడు మొదలైన మహిళా కార్మిక నిరసన ప్రదర్శనలు.. వెంటనే సమ్మెలుగా రూపాంతరం చెందాయి.

మహిళలు మాత్రమే కాకుండా అన్ని రంగాల్లోని కార్మికులూ మూకుమ్మడిగా సమ్మెలకు దిగారు.

తిండి కోసం, యుద్ధం నుంచి శాంతి కోసం, కార్మిక హక్కుల కోసం, మహిళల ఓటు హక్కు కోసం, నియంతృత్వానికి ముగింపు పలకటం డిమాండ్లతో ఆ సమ్మెలు సాగాయి.

దీంతో వారం రోజుల్లోనే రష్యా పాలకుడు జార్ నికొలస్ చక్రవర్తిగా తప్పుకున్నాడు. తాత్కాలిక ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కు కల్పించింది.

ఈ పరిణామం రష్యా సామ్రాజ్యం అంతానికి నాంది పలికింది. 1922లో సోవియట్ యూనియన్ ఏర్పాటుకు మొదటి అంకంగా నిలిచింది.

అలా రష్యాలో 1917లో జరిగిన రెండు బూర్జువా ప్రజాస్వామిక విప్లవాల్లో మొదటిది మార్చి 8 (జూలియన్ కేలండర్‌లో ఫిబ్రవరి 23వ తేదీ) విప్లవం మొదటిదిగా నిలిచింది.

మహిళలకు ఓటు హక్కు

women's day
మహిళలకు ఓటు హక్కు కోసం 1911లో భారతదేశంలో కూడా మహిళలు ఉద్యమించారు

ఆ కాలంలో ప్రపంచ దేశాల్లో మహిళలకు రాజకీయాల్లో చోటు లేదు. అసలు వారికి ఓటు హక్కే లేదు.  

తొలిసారిగా రష్యా మహిళలు మహిళా దినోత్సవం నిరసనల ద్వారా ఓటు హక్కు కోసం కూడా ఉద్యమించారు. 1917లో ఆ హక్కును సాధించుకున్నారు.

అలా మహిళలకు ఓటు హక్కు కల్పిస్తూ చట్టం చేసిన మొట్టమొదటి అగ్ర రాజ్యంగా రష్యా నిలిచింది.

ఆ తర్వాత ఒక సంవత్సరానికి బ్రిటన్, మూడు సంవత్సరాల తర్వాత అమెరికా దేశాలు కూడా మహిళలకు ఓటు హక్కు కల్పించాయి.

అయితే.. సోవియట్ రష్యా, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం 20వ శతాబ్దంలో అమెరికాలో మహిళా దినోత్సవానికి పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు.

నాటి సోవియట్ యూనియన్‌తోను, సోషలిజంతోను మహిళా దినోత్సవానికి గల రాజకీయ అనుబంధం దీనికి కారణం.

నిజానికి ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించింది 1975వ సంవత్సరంలో.

ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రతి ఏటా మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు.

మహిళలు ఇప్పటికే ఎదుర్కొంటున్న వివక్షలు, అసమానతలు, అణచివేతల గురించి గళమెత్తటానికి, ఆ సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయటానికి ఈ మహిళా దినోత్సవం వేదికగా నిలుస్తోంది.

women's day

Women’s Day 2024 థీమ్ ఇదీ…

జీవిత రంగంలోని అన్ని అంశాల్లోనూ మహిళలకు, బాలికలకు సమాన హక్కులు కల్పిస్తూ 2030 సంవత్సరం నాటికి లింగ సమానత్వం సాధించటం అంతర్జాతీయ లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఇంకా ఆరేళ్ల కాలంలో ఈ లక్ష్యం నెరవేరుతుందా? దీనికి అనేక సవాళ్లున్నాయి. అందులో మొదటిది లింగ సమానత్వ సాధన చర్యలపై వ్యయం చేయటం.

ఇప్పటికే ఈ వ్యయంలో 36,000 కోట్ల డాలర్ల లోటు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి అంచనా.

ఈ నేపథ్యంలో ‘మహిళల కోసం పెట్టుబడి పెట్టాలి: పురోగతి వేగాన్ని పెంచాలి (Invest in women: Accelerate progress) అనే నినాదంతో 2024 International Women’s Day నిర్వహణకు పిలుపునిస్తోంది.

కోవిడ్ మహమ్మారి కారణంగా, భౌగోళిక రాజకీయ సంఘర్షణల కారణంగా, వాతావరణ విపత్తుల కారణంగా, ఆర్థిక సంక్షోభాల కారణంగా 2020 సంవత్సరం నుంచి మరో 7.5 కోట్ల మంది జనం పేదరికంలో కూరుకుపోయారని ఐరాస చెప్తోంది.

దీని ఫలితంగా 2030 సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 34.2 కోట్ల మంది మహిళలు, బాలికలు దారిద్ర్య రేఖ దిగువన బతుకులీడ్చే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తోంది.

ఒకవైపు సంఘర్షణలు, మరోవైపు పెరుగుతున్న ఆహార, ఇంధన ధరల కారణంగా ప్రపంచ దేశాల్లో మూడో వంతు దేశాలు 2025 నాటికి ప్రభుత్వ వ్యయాల్లో కోత పెడతాయని ఇటీవలి అంచనాలు చెప్తున్నాయి.

ఈ పొదుపు చర్యలు మహిళల మీద ప్రతికూల ప్రభావం చూపుతాయి. అత్యవసర ప్రజా సేవలు, సామాజిక భద్రత మీద వ్యయాలు తగ్గిపోతాయి.

ఈ పరిస్థితుల్లో తక్షణ చర్యలు కీలకమని పిలుపునిస్తోంది.

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe