అంబేద్కర్ జీవిత చరిత్ర: ‘పీడకలగా మారిన చిన్ననాటి కోరేగావ్ ప్రయాణం’

‘‘మా కుటుంబానిది నిజానికి దాపోలి. బొంబాయి ప్రెసిడెన్సీలోని రత్నగిరి జిల్లాలో ఉంటుంది.

మా పూర్వీకులు చాలా కాలం కిందటే తమ వంశపారంపర్య వృత్తిని విడిచిపెట్టారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభమైన నాటి నుండి కంపెనీ సైన్యంలో చేరారు. మా నాన్న కూడా కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి ఆర్మీలో చేరాడు. అధికారి హోదాకు ఎదిగాడు. సుబేదార్‌గా పదవీ విరమణ చేశాడు.

పదవీ విరమణ చేశాక దాపోలిలో స్థిరపడాలని అనుకున్నాడు. మా కుటుంబాన్ని అక్కడికి తీసుకువెళ్లాడు. కానీ కొన్ని కారణాల వల్ల మనసు మార్చుకున్నాడు. మా కుటుంబం దాపోలి నుండి సతారాకు మారింది. మేం 1904 వరకూ అక్కడే నివసించాం.

నేను రాస్తున్న మొదటి సంఘటన ఇది. నాకు గుర్తున్నంత వరకూ రాస్తున్నా. సుమారు 1901 సంవత్సరంలో ఇది జరిగింది. అప్పుడు మేం సతారాలో ఉన్నాం. అప్పటికి మా అమ్మ చనిపోయింది.

మా నాన్న సతారా జిల్లాలోని ఖాతావ్ తాలూకాలో కొరెగావ్ అనే ఊర్లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ అప్పుడు కరువు బారిన పడ్డ ప్రజలు వేలాదిగా చనిపోతున్నారు. ప్రజలకు ఉపాధి కల్పించడానికి బొంబాయి ప్రభుత్వం ఒక చెరువు తవ్వే పని ప్రారంభించింది.

మా నాన్న కోరెగావ్‌ వెళ్ళినప్పుడు నన్ను, మా అన్నను, మా అక్క (చనిపోయింది) కొడుకులు ఇద్దరిని.. మా అత్త దగ్గర విడిచిపెట్టి వెళ్లారు. ఇరుగుపొరుగు వారు కూడా మా సంరక్షణలో పాలుపంచుకునేవాళ్లు.

మా అత్త చాలా మంచి మనిషి. కానీ ఆమె కాళ్ళు దెబ్బతిన్నాయి. పొట్టిగా ఉండేది. ఎవరి సహాయం లేకుండా ఆమె లేచి తిరగడం చాలా కష్టం. తరచుగా ఆమెను ఎత్తుకుని నడిపించాల్సి వచ్చేది. కాబట్టి మాకు పెద్దగా సాయం చేయలేదు.

నాకు అక్కలు ఉన్నారు కానీ వాళ్లు పెళ్లి చేసుకున్నారు. వాళ్ల వాళ్ల కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు.

మాకు వంట చేసుకోవటం సమస్యగా మారింది. ముఖ్యంగా మా అత్త ఆ పని చేయలేదు. మేం నలుగురం పిల్లలం. మా వంట మేమే చేసుకుని బడికి వెళ్లేవాళ్లం. కానీ రొట్టెలు చేయటం మాకు సరిగా రాదు. దీంతో పులావు చేసుకుంటూ గడిపేవాళ్లం. బియ్యంలో కొంత మాసం వేసి ఉడికిస్తే చాలు. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇదే సులభమైన వంటకంగా కనిపించింది.

మా నాన్న క్యాషియర్‌గా పనిచేసేవాడు. ఆయన ఉన్న ఊరి నుంచి మమ్మల్ని చూడటానికి సతారాకు రావటానికి కుదిరేది కాదు. మా వేసవి సెలవులకు తన దగ్గర గడపటానికి కోరెగావ్‌ రండని మాకు ఉత్తరం రాశాడు. మేం చాలా సంబరపడ్డాం. ఎందుకంటే మాలో ఎవరం అప్పటి వరకు రైల్వే రైలు చూడలేదు.

ప్రయాణానికి చాలా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇంగ్లిష్ వాళ్ల తరహాలో కొత్త చొక్కాలు, మెరిసిపోయే బెజ్వెల్డ్ టోపీలు, బూట్లు, పట్టు అంచు ధోతీలు అన్నీ కొత్తవి తెప్పించుకున్నాం.

మేం ఎలా రావాలనే వివరాలన్నీ మా నాన్న ఉత్తరంలో రాశాడు. ఏ రోజున బయలుదేరుతున్నామో తనకు తెలియజేయాలని కూడా మాకు చెప్పాడు. మమ్మల్ని కొరెగావ్‌ తీసుకెళ్లడానికి తన ప్యూన్‌ను రైల్వే స్టేషన్‌కు పంపుతానని చెప్పారు.

నేను, నా అన్న, అక్క కొడుకులు ఇద్దరు.. నలుగురం సతారా నుంచి బయలుదేరాం. మా అత్త బాధ్యతను మా పొరుగింటి వారికి అప్పగించాం. ఆమెను చూసుకుంటామని వాళ్లు భరోసా ఇచ్చారు.

మా ఊరి నుంచి రైల్వే స్టేషన్ పది మైళ్ళ దూరంలో ఉంది. స్టేషన్‌కు వెళ్లటానికి ఒక టోంగా మాట్లాడుకున్నాం. ప్రత్యేకంగా తయారుచేసిన కొత్త బట్టలు తొడుక్కున్నాం. అందరం ఆనందంగా ఇల్లు వదిలిపెట్టాం. కానీ మా అత్త ఏడుస్తూ ఉంది. దాదాపు సొమ్మసిల్లింది. మేం దూరంగా వెళుతున్నామని.

మేం స్టేషన్‌కు చేరుకున్నాం. మా అన్న టిక్కెట్లు కొన్నాడు. నాకు, మా అక్క కొడుకులకు రెండు అణాలు చొప్పున ఇచ్చాడు. పాకెట్ మనీగా. మా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోవటానికి. మేం ఒక్కసారిగా అల్లరి మొదలుపెట్టాం. తలా ఒక నిమ్మరసం కొనుక్కుని తాగాం.

కొద్దిసేపటికి రైలు కూత వినిపించింది. మేం త్వరత్వరగా ఎక్కేశాం. లేకపోతే మేం ఎక్కకముందే రైలు వెళ్లిపోతుందని భయం. కొరెగావ్‌ వెళ్లాలంటే మసూర్ అనే రైల్వే స్టేషన్‌లో మేం దిగాలని చెప్పారు.

రైలు సాయంత్రం ఐదు గంటలకు మసూర్ చేరుకుంది. మేం మా సామాను పట్టుకుని దిగాం. రైలు నుంచి దిగిన మిగతా ప్రయాణికులందరూ కొద్ది నిమిషాల్లో ఖాళీ అయ్యారు. తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.

మేం నలుగురు పిల్లలం ప్లాట్‌ఫాం మీదే ఉన్నాం. మా నాన్న కానీ, ఆయన పంపిన ప్యూన్ కానీ వచ్చారేమోనని వెదుకుతున్నాం. చాలాసేపు చూశాం. కానీ ఎవరూ లేరు. ఒక గంట గడిచిపోయింది.

మమ్మల్ని చూసి స్టేషన్ మాస్టర్ మా దగ్గరకొచ్చాడు. మా టిక్కెట్లు అడిగాడు. మేం చూపించాం. ఇంకా ప్లాట్‌ఫాం మీదే ఎందుకున్నారని అడిగాడు.

మేం కోరెగావ్ వెళ్లాలని చెప్పాం. మా నాన్న కానీ, ఆయన ప్యూన్ కానీ వస్తారని ఎదురుచూస్తున్నట్లు చెప్పాం. కానీ ఇద్దరూ కనిపించలేదన్నాం. కోరెగావ్ వెళ్లటం ఎలాగో మాకు తెలియదనీ వివరించాం.

మేం మంచి దుస్తులు ధరించి ఉన్నాం. మా దుస్తులు, మా మాటలను చూస్తే.. మేం అంటరానివారి పిల్లలం అని ఎవ్వరూ చెప్పలేరు. నిజానికి మేం బ్రాహ్మణ పిల్లలమని స్టేషన్ మాస్టర్ చాలా ఖచ్చితంగా అనుకున్నాడు. మా పరిస్థితి చూసి ఆయన చాలా కదిలిపోయాడు.

హిందువులు ఎప్పడూ అడిగినట్లుగానే మేం ఏమిట్లమని స్టేషన్ మాస్టర్ అడిగాడు. నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మహర్లం అని చెప్పాను. అతడు నివ్వెరపోయాడు.

అతడు నివ్వెరపోయాడు. అతడి ముఖకవళికలు అకస్మాత్తుగా మారిపోయాయి. అతడిలో ఒక వింత వికర్షణా భావం కొట్టొచ్చినట్లు కనిపించింది. నా సమాధానం విన్న వెంటనే అతడు తన గదికి వెళ్ళిపోయాడు.

మేం ఉన్న చోటే నిలబడి ఉన్నాం. ఓ పదిహేను, ఇరవై నిమిషాలు గడిచిపోయాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు. మా నాన్న రాలేదు. తన ప్యూన్‌నీ పంపించలేదు. స్టేషన్ మాస్టర్ కూడా విడిచిపెట్టి పోయాడు. మాకు చాలా చిరాకు కలిగింది.

బయలుదేరినప్పుడు ఉన్న ఆనందం పోయింది. తీవ్ర విచారంగా మారింది.

అరగంట తరువాత స్టేషన్ మాస్టర్ తిరిగి వచ్చాడు. ఏం చేద్దామనుకుంటున్నారు అని అడిగాడు. కిరాయికి ఎడ్ల బండి దొరికితే కోరెగావ్ వెళ్తాం అని చెప్పాం. మరీ దూరం కాదంటే వెంటనే బయలుదేరతామని కూడా చెప్పాం.

అక్కడ చాలా ఎడ్ల బండ్లు కిరాయికి తిరుగుతున్నాయి. కానీ మేం మహర్లం అని స్టేషన్ మాస్టర్‌కు నేను చెప్పిన మాట.. ఎడ్ల బండ్ల వాళ్లందరికీ తెలిసిపోయింది. వాళ్లలో ఒక్కరు కూడా మైల పడటానికి సిద్ధంగా లేరు. తమ బండ్లలో అంటరాని వాళ్లను ఎక్కించుకుని తన స్థాయిని తగ్గించుకోవటం ఎవరికీ ఇష్టం లేదు.

మేం రెండింతల చార్జీలు చెల్లించటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ డబ్బు పని చేయదని మాకు తెలిసొచ్చింది.

మా తరఫున చర్చలు జరుపుతున్న స్టేషన్ మాస్టర్ ఏం చేయాలో తెలియక మౌనంగా నిలబడ్డాడు. అకస్మాత్తుగా అతడి తలలో ఒక ఆలోచన వచ్చినట్లు అనిపించింది.

‘‘మీకు బండి తోలటం వచ్చా?’’ అని మమ్మల్ని అడిగాడు. మా కష్టానికి అతడు ఏదో పరిష్కారం కనుగొంటున్నట్లు అనిపించింది. ‘‘వచ్చు, మేం తోలుతాం’’ అని అరిచాం. ఆ జవాబు విని అతడు వెళ్లాడు. మా తరఫున ఒక ప్రతిపాదన చేశాడు.

ఎండ్ల బండివాడికి మేం రెండింతల చార్జీలు చెల్లించాలి. బండి మేమే తోలాలి. బండివాడు నడుస్తూ బండివెంట వస్తాడు. ఇందుకు ఒక బండివాడు ఒప్పుకున్నాడు. ఎందుకంటే రెండింతల చార్జీ సంపాదించొచ్చు. మైల పడకుండానూ ఉండొచ్చు.

మేం బయలుదేరేటప్పటికి సాయంత్రం 6:30 అయింది. మాకు ఆందోళనగా ఉంది. చీకటి పడకముందే కోరెగావ్ చేరుకుంటామని భరోసా ఇస్తే తప్ప స్టేషన్ నుండి బయలుదేరకూడదని అనుకున్నాం.

కొరెగావ్ ఎంత దూరం ఉంది, ఎప్పటికి చేరుకుంటాం అని మేం బండివాడిని అడిగాం. మూడు గంటలకు మించి ఎక్కువ పట్టదని అతడు భరోసా ఇచ్చాడు. అతడి మాట నమ్మాం. మా సామాను ఎడ్ల బండిలో పెట్టాం. స్టేషన్ మాస్టర్‌కు కృతజ్ఞతలు చెప్పాం. బండి ఎక్కాం. మాలో ఒకరు పగ్గాలు తీసుకున్నారు. బండి ముందుకు సాగింది. బండివాడు పక్కన నడుస్తున్నాడు.

స్టేషన్ నుంచి ఎక్కువ దూరం పోలేదు. ఒక నది కనిపించింది. దాదాపుగా ఎండిపోయి ఉంది. అక్కడక్కడా కొన్ని నీటి గుంటలు ఉన్నాయి. అక్కడ ఆగి భోజనం చేయండని చెప్పాడు బండి యజమాని. దార్లో మళ్లీ నీళ్లు దొరక్కపోవచ్చన్నాడు. మేం సరే అన్నాం.

అతడు ఊర్లోకి వెళ్లి భోజనం చేస్తానన్నాడు. అందుకోసం తన చార్జీలో కొన్ని డబ్బులు ఇవ్వండని అడిగాడు. మా అన్న కొంత డబ్బు ఇచ్చాడు. అతడు త్వరగా తిరిగి వస్తానని చెప్పాడు.

మాకు చాలా ఆకలిగా ఉంది. ఓ ముద్ద తినటానికి వీలు చిక్కినందుకు సంతోషించాం. మేం దార్లో తినటం కోసం మా అత్త పక్కింటివాళ్ల సాయంతో అన్నం వండి బుట్టలో పెట్టి ఇచ్చింది. మేం బుట్ట తెరిచి తినటం మొదలుపెట్టాం.

వస్తువులను కడగటానికి నీళ్లు కావాలి. నదిలో నీటి గుంట దగ్గరకు వెళ్లాం. కానీ ఆ నీళ్లు నిజమైన నీళ్లు కాదు. బురద నీళ్లు. అక్కడ నీళ్లు తాగటానికి వచ్చిన ఆవులు, గేదెలు, పశువుల పేడ, మూత్రాలతో నిండివుంది.

అవి మనుషులు వాడే నీళ్లు కాదు. చాలా కంపు కొడుతున్నాయి. మేం తాగలేకపోయాం. ఆకలి తీరకుండానే బుట్ట మూసేశాం.

బండివాడు వస్తే బయల్దేరుదామని ఎదురు చూస్తున్నాం. చాలా సేపటి వరకూ అతడు రాలేదు. మేం అన్ని దిక్కుల్లో అతడి రాక కోసం చూడటం తప్ప చేయగలిగిందేమీ లేదు.

చివరికి అతడొచ్చాడు. మేం మళ్లీ బయల్దేరాం. ఓ నాలుగైదు మైళ్ళ వరకు మేమే బండి నడిపాం. అతడు నడుస్తూ వచ్చాడు. అంతలో ఉన్నట్టుండి బండెక్కాడు. మా చేతిలో నుంచి పగ్గాలు తీసుకున్నాడు.

మైల పడతాననే భయంతో మమ్మల్ని బండి ఎక్కించుకోటానికి ఒప్పుకోని మనిషి ఇప్పుడు వింతగా ప్రవర్తించటం ఏంటో అనుకున్నాం. తన అంటు, ముట్టు అభ్యంతరాలన్నీ పక్కన పెట్టేసి.. మాతో పాటు ఒకే బండిలో కూర్చున్నాడు. కానీ అతడిని ఏమీ అడగలేదు.

మేం వెళ్లాల్సిన కోరెగావ్‌కి ఎంత త్వరగా వెళ్తామా అని ఆత్రంగా ఉన్నాం. బండి నడుస్తుంటే దాని కదలికలను గమనిస్తూ మౌనంగా ఉన్నాం.

చూస్తుండగానే చీకటి పడింది. దారి చూపటానికి వీధి దీపాలేం లేవు. మనుషుల మధ్యలో ఉన్నామనుకోవటానికి చుట్టూ మగాళ్లు కానీ, ఆడాళ్లు కానీ ఎవరూ లేరు. కనీసం పశువులైనా లేవు.

ఆ ఒంటరితనంలో భయపడ్డాం. మా ఆందోళన పెరుగుతోంది. ఉన్న ధైర్యమంతా కూడగట్టుకున్నాం. మసూర్ నుంచి చాలా దూరమే వచ్చాం. మూడు గంటలకు పైగా ప్రయాణం సాగించాం. కానీ కోరెగావ్ దరిదాపుల్లోకి వచ్చిన ఆనవాళ్లేమే లేవు.

మాలో ఓ అనుమానం పుట్టుకొచ్చింది. ఈ బండివాడు మమ్మల్ని చంపటానికి తీసుకెళతున్నాడేమోనని భయం పుట్టింది. మా ఒంటిమీద చాలా బంగారు నగలున్నాయి. అది గుర్తొచ్చి మా అనుమానం ఇంకా పెరిగింది.

కోరెగావ్ ఇంకా ఎంత దూరముంది? ఇంకా రాలేదేంటి? ఎందుకు ఆలస్యమవుతోంది? అని అతడిని అడగటం మొదలుపెట్టాం. ‘‘ఎంతో దూరం లేదు. తొందరగానే వస్తుంది’’ అని అతడు బదులిస్తున్నాడు.

అప్పుడు రాత్రి పది గంటల సమయమవుతోంది. కోరెగావ్ దరిదాపుల్లో లేదు. మేం నాలుగురు పిల్లలం ఏడవటం మొదలుపెట్టాం. అతడిని తిడుతున్నాం. అలా చాలా సేపు ఏడుస్తూనే ఉన్నాం. బండివాడు ఏం మాట్లాడటం లేదు.

ఉన్నట్టుంది కొంత దూరంలో వెలుతురు కనిపించింది. ‘‘ఆ వెలుతురు కనిపిస్తోందా? అది టోల్-కలెక్టర్ ఉండే చోటు. మనం రాత్రికి అక్కడ పడుకుందాం’’ అని చెప్పాడు.

మాకు కాస్త ఊరట అనిపించింది. ఏడుపు ఆగిపోయింది. ఆ వెలుతురు చాలా దూరంగా ఉంది. ఎంతసేపు వెళ్లినా అది దగ్గరకు వస్తున్నట్లు కనిపించటం లేదు.

టోల్-కలెక్టర్ గుడిసెకు చేరుకోవడానికి రెండు గంటలు పట్టింది. ఆ మధ్యలో మా ఆందోళన మళ్లీ పెరిగింది. అక్కడికి వెళ్లటానికి ఇంత ఆలస్యం ఎందుకవుతోంది, మనం సరైన దార్లోనే వెళ్తున్నామా అంటూ బండివాడి మీద ప్రశ్నల వర్షం కురిపించాం.

చివరికి అర్ధరాత్రి సమయానికి బండి టోల్-కలెక్టర్ గుడిసెకు చేరుకుంది. అది ఓ కొండ దిగువనుంది. కొండకు ఆవలి వైపుంది. అక్కడ ఎడ్ల బండ్లు చాలా కనిపించాయి. అవన్నీ రాత్రిపూట అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాయి.

మాకు చాలా ఆకలిగా ఉంది. కాస్త తిందామని అనుకున్నాం. కానీ మళ్ళీ నీళ్ల సమస్య వచ్చింది. నీళ్లు దొరుకుతాయా అని మా బండివాడిని అడిగాం.

అతడు టోల్ కలెక్టర్ హిందువని చెప్పాడు. మేం మహర్లమని నిజం చెప్తే మాకు నీళ్లు దొరకవని హెచ్చరించాడు. ‘‘మీరు మహమ్మదీయులు అని చెప్పండి. మీ అదృష్టం ఎలా ఉంటుందో’’ అని సలహా ఇచ్చాడు.

అతడి సలహాతో నేను టోల్ కలెక్టర్ గుడిసెకు వెళ్లాను. మాకు కొంచెం నీళ్లు ఇస్తారా అని అతడిని అడిగాను. మీరు ఎవరు అని అడిగాడతడు. మేం ముస్లింలం అని బదులిచ్చా. అతడితో ఉర్దూలో మాట్లాడాను. (ఇది నాకు బాగా వచ్చు). నేను నిజంగా ముస్లిం కాదనే సందేహం రాదు. కానీ ఆ కిటుకు పని చేయలేదు.

‘‘మీ కోసం ఎవరు నీళ్లు తెచ్చిపెట్టారు? కొండ మీదుంటాయి. వెళ్లి తెచ్చుకోండి. నా దగ్గర లేవు’’ అని కటువుగా చెప్పి నన్ను తిప్పిపంపాడు.

నేను తిరిగి బండి దగ్గరకొచ్చాశా. అతడు చెప్పిన మాటలు మా అన్నకు చెప్పా. మా అన్న ఏమనుకున్నాడో తెలీదు. ఇక పడుకోండని చెప్పాడు.

ఎడ్లను విప్పేసి బండిని ఏటవాలుగా ఉంచారు. బండి లోపల పడకలు పరుచుకుని మేను వాల్చాం. ఇప్పుడు భద్రమైన చోటుకు వచ్చాం. కాబట్టి ఏం జరిగిందనేది పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు జరిగిన సంగతి గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాం.

మా దగ్గర తినటానికి కావలసినంత ఆహారం ఉంది. ఆకలి మండుతోంది. అయినా మేం తినకుండానే నిద్రపోవాల్సి వస్తోంది. ఎందుకంటే మాకు నీళ్లు లేవు. మేం అంటరానివాళ్లం కాబట్టి మాకు నీళ్లు దొరకవు. మా మనసులో మెదిలిన చివరి ఆలోచన అలా ఉంది.

మేం భద్రమైన చోటుకు వచ్చామని నేను అన్నాను. కానీ మా అన్నయ్యకు అనుమానం పోలేదు. మేం నలుగురం నిద్రపోవటం మంచిది కాదన్నాడు. ఏదైనా జరగొచ్చు. ఒకసారి ఇద్దరు నిద్రపోవాలని, మిగతా ఇద్దరు కాపలా ఉండాలని చెప్పాడు. అలా ఆ రాత్రి ఆ కొండ దిగువన గడిపాం.

తెల్లవారుజామున ఐదు గంటలకు మా బండివాడు వచ్చాడు. ఇక కోరెగావ్ బయల్దేరదాం అన్నాడు. మేం నిరాకరించాం. ఎనిమిదయ్యే వరకు కదిలేది లేదని చెప్పాం. ఎలాంటి ప్రమాదంలో పడకూడదని మేం అనుకున్నాం. అతడు ఏమీ అనలేదు.

ఉదయం ఎనిమిదింటికి బయలుదేరాం. పదకొండు గంటలకు కోరెగావ్ చేరుకున్నాం. మమ్మల్ని చూసి మా నాన్న ఆశ్చర్యపోయాడు. మేం వస్తున్నట్లు తనకు కబురు అందలేదని చెప్పాడు.

మేం నిరసనగా మాట్లాడాం. కబురు పంపించామని చెప్పాం. ఆయన అది నిజం కాదన్నాడు. ఆ తర్వాత తప్పు మా నాన్న దగ్గర ప్యూన్‌ది అని తెలిసింది. అతడికి మా ఉత్తరం అందింది. కానీ దానిని మా నాన్నకు ఇవ్వలేదు.

ఈ సంఘటనకు నా జీవితంలో చాలా ముఖ్యమైన స్థానం ఉంది. అది జరిగినప్పుడు నా వయసు తొమ్మిది సంవత్సరాలు. కానీ ఇది నా మనసులో చెరగని ముద్ర వేసింది.

ఈ సంఘటన జరగడానికి ముందు, నేను అంటరానివాడని, అంటరానివారు కొన్ని అగౌరవాలకు, వివక్షలకు గురవుతుంటారని నాకు తెలుసు.

ఉదాహరణకు, నేను బడిలో నా ర్యాంకు ప్రకారం (తరగతిలో చూపే ప్రతిభ ప్రకారం) నా తోటి విద్యార్థుల మధ్యలో కూర్చోలేను. అది నాకు తెలుసు. నేను ఒక్కడినే ఒక మూల కూర్చోవాలి.

తరగతి గదిలో కూర్చోవటానికి నాకు ప్రత్యేకంగా ఒక గోనె సంచి ముక్క ఉండాలి. అది నాకు తెలుసు. బడిని ఊడ్చే ఉద్యోగి నేను వాడే గోనె సంచిని తాకడు. నేను ఇంటికి వెళ్లేటపుడు ఆ గోనె సంచిని తీసుకెళ్లాలి. మళ్లీ మరుసటి రోజు తిరిగి తెచ్చుకోవాలి.

బడిలో ఉన్నప్పుడు నాకు తెలుసు. అంటగల తరగతుల వారి పిల్లలకు దాహం వేస్తే.. కుళాయి దగ్గరకు వెళ్లి, దాన్ని తెరిచి, వారి దాహం తీర్చుకోచ్చు. అందుకు టీచర్ అనుమతిస్తే చాలు.

కానీ నా పరిస్థితి వేరు. నేను కుళాయిని తాకకూడదు. అంటదగ్గ వ్యక్తి ఎవరైనా కుళాయిని తెరవకపోతే.. నా దప్పిక తీరదు. నా విషయంలో టీచర్ అనుమతిస్తే చాలదు. స్కూల్ ప్యూన్ కూడా ఉండాలి.

ఎందుకంటే.. అటువంటి అవసరానికి టీచర్ ఉపయోగించగల ఏకైక వ్యక్తి అతడే. ప్యూన్ లేకపోతే, రాకపోతే నాకు దప్పికవుతున్నా నీళ్లు తాగకుండా ఉండాల్సిందే.

ఒక్క ముక్కలో చెప్పాలంటే.. – ప్యూన్ లేకపోతే నీళ్లు లేవు.

ఇంట్లో బట్టలు ఉతకే పని నా అక్కలు చేస్తారని నాకు తెలుసు. సతారాలో బట్టలు ఉతికే రజకులు లేక కాదు. బట్టలు ఉతికితే రజకులకు మేం డబ్బులు చెల్లించలేని పరిస్థితిలోనూ లేము.

నా అక్కలు బట్టలు ఉతకటానికి కారణం.. మేం అంటరానివాళ్ళం. రజకులు ఎవరూ అంటరానివారి బట్టలు ఉతకరు.

మా జుట్టు కత్తిరించటం, నాతో సహా మగపిల్లలకు గడ్డం గీయటం అంతా మా పెద్దక్క చేస్తుంది. ఈ కళలో ఆమె చేయి తిరిగిన బార్బర్‌గా మారింది. మా మీద అభ్యాసం చేయటమే అందుకు కారణం.

సతారాలో బార్బర్లు లేరని కాదు. బార్బర్లకు మేం డబ్బులు చెల్లించలేమనీ కాదు.

మా జుట్టు కత్తిరించటం, గడ్డం గీయటం మా అక్క చేయటానికి కారణం.. మేం అంటరానివాళ్లం. అంటరానివారి జుట్టు కత్తిరించటానికి, గడ్డం చేయటానికి ఏ బార్బరూ ఒప్పుకోడు.

ఇవన్నీ నాకు తెలుసు. కానీ ఆ ప్రయాణం నాకు అంతకుముందెన్నడూ లేనంత షాక్ ఇచ్చింది. అది అంటరానితనం గురించి ఆలోచించేలా చేసింది.

ఆ సంఘటనకు ముందు.. చాలా మంది అంటగలిగిన వారు, అంటరానివారు అనుకున్నట్లుగానే నేను కూడా అంటరానితనం ఒక మామూలు విషయంగానే అనుకున్నాను.’’

(డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాసిన ఆత్మకథా వ్యాసాలు ‘Waiting for a Visa’లోని మొదటి భాగం ‘A childhood journey to Koregaon becomes a nightmare’ తెలుగు అనువాదం)

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe