Drugs and children: పెద్దల పెంపకం నుంచి పిల్లలకు విముక్తి కావాలి

పిల్లల ఆగడాలతో వారి చెడు అలవాట్లతో విసిగెత్తిపోయిన తల్లిదండ్రులు ఇక తిరుగుబాటుకి సిద్ధమవుతున్నట్టే వుంది. ఈ ‘ప్రజా ప్రయోజన వార్త’ని చక్కగా ఎవరో ప్లాను చేసి తల్లికి సహకారమూ ప్రోత్సాహమూ ఇచ్చి నిర్వహించినట్టుంది.

ఇది టీవీ వాళ్ల నిర్వాకమే కావచ్చును. దగ్గరుండి చానెల్ వాళ్లే ఇదంతా ఏర్పాటు చేసివుండొచ్చు. లేదూ చైతన్యమూ ఉత్సాహమూ లోకానికి మేలు చేద్దామనే తపన బాగా వున్న బాధ్యత గలిగిన, బుర్రలేని పౌరులెవరో మీడియా సాయంతో ఈ వార్తని, వాస్తవాన్నే, కల్పించారు.

ఈ మాతృమూర్తి (టీవీ వారి మాట)కి అనువుగా ఆమె కొడుకునెవరో విద్యుత్ స్థంభానికి కట్టేసి తోడ్పడ్డారు. ఆ ఛానెల్ ఈ అకృత్యాన్ని శెభాషంటూ ప్రసారం చేసింది. వార్త యావత్తూ తల్లినీ ఆమె చేసిన ఆగడాన్నీ మెచ్చుకుంటూనే చూపారు. చూసేవారికి రోత పుట్టకుండా అవసరమైన చోట బ్లర్ చేశారు. చూసేవారి మనోభావాలకి మార్గదర్శకంగా వ్యాఖ్యానం సాగింది.

క్రూరత్వమూ, ఆగడమూ, అఘాయిత్యమూ, ఒడిగట్టడమూ, పాల్పడటమూ లాంటి మాటలుగానీ ప్రాణం విసిగిపోవడమూ గుండె రాయిచేసుకోవడం లాంటి క్వాలిఫికేషన్లు గానీ ఎక్కడా వార్తరాసిన వారు వాడలేదు. యాంకరూ అలాంటివేమీ వార్త చదువుతున్నప్పుడు చేర్చలేదు.

ఆ తల్లి పాల్పడుతున్నది నేరమని గానీ ఆమె మీద కేసు పెట్టాలని గానీ శిక్షవేయాలని గానీ ఎవరికీ తోచకుండా వుండాలనే ఎరుకతోనే ఆ వార్తని రాశారు. నెటిజెన్లు ఆమెకి జేజేలు పలికారని కూడా చానెల్ వారు ప్రత్యేక శ్రద్ధతో పేర్కొన్నారు. వారి స్పందనే గానీ, పోలీసుల స్పందనేమిటని దాచిపెట్టారు (నేరాలని రిపోర్టు చేసేటప్పుడు పోలీసుల వెర్షను తీసుకుని తీరాలన్నది ఇండియాలో నియమం. సాధారణంగా దాన్ని మీడియా, కనీసం పత్రికలు, పక్కాగా పాటిస్తాయి).

బర్బర నీతి సూత్రం

కాబట్టి మాదక ద్రవ్యాలని వాడిన (Substance Abuse) పిల్లలపై అఘాయిత్యం చేయడమే (Child Abuse) విరుగుడనే మరొక కొత్త బర్బర నీతి సూత్రాన్ని ఛానెల్ వాళ్లు నేర్పారు. కాబట్టి పథకంపన్ని పదహారేళ్ల కుర్రాడి పట్ల క్రూరత్వాన్ని చూపారనే నేరాన్నెవరిమీదా, ఈ తెరవెనుక వుండి కథ నడిపించిన పౌరుల మీద, ఆ తల్లిమీద, ఈ వార్తా చానెల్ మీద, మోపరన్నది ఖాయం. ఆ నెటిజెన్లకి అంతర్జాల మాధ్యమాలలో నాగరికులెవరయినా మొట్టికాయలేస్తారని ఆశించవచ్చునేమో.

వీధుల్లోంచి, పేదల నుంచి, స్లమ్‌ల నుంచి నాగబాబుకిది సమాధానమని, అతగాని ఆలోచనా వికారాలకి సామాజిక మాధ్యమాల్లో వెటకారపు సమాధానాలిచ్చేవారు ఎలాగూ ఈ తల్లిని ఆకాశానికెత్తుతారు. వెనకేసుకురావడం కాదు వెర్రి నాగయ్యా, దారితప్పిన పిల్లలది, మరీ ముఖ్యంగా ఆడపిల్లలది, మాడు పగలగొట్టాలని వారు సలహా ఇస్తారు.

ఆ మధ్య యూపీలో పోలీసులని ఊతకోత కోసిన ఒక మాఫియా నేరస్తుడిని, అతడి తల్లే ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆ మాతృమూర్తి కోరికని యోగి ప్రభుత్వం సాదరంగా మన్నించింది కూడా.

మరి మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి పిల్లలని కాపాడుకోవడం ఎలా? స్థంభాలకి కట్టేయడం, కళ్లలో కారం కొట్టడం లాంటి వైపరీత్యాలూ రాజాసింగ్ కోరుతున్న ఎన్‌కౌంటర్లూ (ఫిలిపీన్స్ నేత అదే చేస్తాడు) కాక, నాగరికంగా ఏంచేయాలి?

సమస్య ముదిరి కనిపించినంత స్పష్టంగా పరిష్కారం కనరాకపోవడం వలన నిరాకరణా (డినాయిల్), తప్పుడు చికిత్సలూ (మరింత హింస, మరికాస్త నిర్బంధం), వీలేకాని పరిష్కారాలూ (ప్రతి ఒక్కరికీ థెరపీ అందించడం) కాకుండా, మరే విషయాలని ఆలోచించాలి?

drug addiction

నిరంతర పర్యవేక్షణ

పెంపకం (upbringing) లో గద్దింపులూ క్రూరత్వమూ తగ్గించి గారాబమూ అనునయమూ పెంచిన వైనం ప్రధాన స్రవంతి పద్ధతిగా మారి ఎక్కువ దశాబ్దాలు కాలేదు. ఈకాలంలోనే, న్యూక్లియర్ కుటుంబ తల్లిదండ్రులలో అత్యధికులు అడపాదడపా శిక్షించేకంటే నిరంతర పర్యవేక్షణే మంచిదనే పద్ధతికి మారేరు. మానవీయమైన పెంపక విలువలూ పద్ధతులూ కొత్తవేమీ కావు. అవి ప్రధాన స్రవంతి ఆచరణగా, అత్యధికుల ప్రవర్తనగా మారడమే కొత్త.

(ఈ కాల వ్యవధిలోనే భారతదేశ చరిత్ర మొత్తంలో అత్యంత ఉధృతంగా ఆర్థికాభివృద్ధి జరిగింది. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో (నిరపేక్ష సంఖ్యా, నిష్పత్తీ, కాలవ్యవధీ, వీటన్నిటిలోనూ) మనుషులు పేదరికం నుంచి బయటపడిందిప్పుడే. ఒక దశాబ్దం అటూ ఇటూగా చైనా ఇండియాలు సాధించిన విజయమిది. రక్తపాతం, నిరంకుశత్వం, త్యాగాలతో, నూతన విలువలతో మావోయిస్టు చైనా; స్వార్ధంతోనే, అడ్డదిడ్డంగా, అసమర్ధంగా కానీ శాంతియుతంగా మన్మోహన్ ఇండియా ఈ మహత్తర ఘట్టంలో ప్రధాన పాత్ర పోషించాయి.

మావో మహోపాద్యాయుడు అంత కష్టంతో అన్ని ప్రాణాలు బలిపెట్టి, బలిగొని, చేసిన పేదరిక నిర్మూలన, అసలేం కరువులూ మారణహోమాలూ లేకుండా మన్మోహన్ మహాశయుని విధానం కూడా అంతే స్థాయిలో సాధించిందని పోల్చుకోవడమే నాకు చాలా ఆలస్యమైంది. అప్పటికీ గుండెపగిలినంత పనైంది. తేరుకోడానికి చాలాకాలం పట్టింది. బాహాటంగా ఒప్పుకోడానికి మరెంతో కాలం పట్టింది.)

మరిచిపోవద్దు, రాజ్యం ప్రజలని బలప్రయోగంతో వారి విధేయతని సంపాయించే మార్గంనించి క్రమంగా మళ్లి, సమ్మతితో పాలించే వ్యవస్థకూ, పౌరహక్కుల చట్టబద్ధ పాలనకీ మారినచోట్లలో – పాశ్చాత్య తెల్ల మెజారిటీ క్రైస్తవ లౌకిక ఉదారవాద లేదా సాంఘిక ప్రజాస్వామ్య దేశాలు – సరిగ్గా ఇలాంటి మార్పే జరిగింది.

రాజ్యంతో పౌరులకున్న సంబంధం దాదాపు తలకిందులవడం, అంటే పాలన స్వభావమే మారడం (క్లుప్తంగా ప్రజాస్వామ్యం) సరిగ్గా ఈ రకంగానే, పిల్లల పట్ల తల్లిదండ్రుల ధోరణిలో మార్పులాగే, వచ్చింది. బలప్రయోగ స్థానంలో సమగ్ర సమాచార సేకరణా, క్రోడీకరణా, సర్వవ్యాప్త నిఘా ద్వారా హింసని తగ్గించడం దీనిలోని అతి ముఖ్యమైన మార్పు.

ప్రపంచ చరిత్ర మొత్తాన్ని తీసుకుంటే, ఫాసిస్టు, తొలి కమ్యూనిస్టు వ్యవస్థలని మినహాయించితే, పౌరుల, పాలితుల సమాచార సేకరణా నిఘాల వలన ప్రభుత్వ దమనం తగ్గింది గానీ (కొన్ని వామపక్ష వాదనలు చెప్పినట్టుగా) పెరగలేదు. పౌరుల సమాచారం సమగ్రంగా రాజ్యం సేకరించడం వలన హక్కుల ఉల్లంఘన తగ్గింది. నిఘా, పర్యవేక్షణ వలన నిర్బంధం తక్కువైంది. ఈ రెంటి మధ్యా పెద్ద తేడా ఏమీ లేదనీ రెండోదానిలోనే మోసమనీ మొదటిదే మెరుగనీ మొరటు ఫూకోల్డియనులు అంటారు. వలసానంతరవాద అధ్యయన రకాలు అవునంటూ తలూపుతారు.

అసలు అణిచివేత, అన్యాయాలు పెట్టుబడిదారీ విధానంతోనే మెుదలయ్యాయన్నట్టుగా మన సమకాలీన వామపక్ష ప్రొఫెసర్లు ఒక భ్రమ కలిగించడానికి ప్రయత్నిస్తుంటారు. వాళ్లకీ తెలుసు అది నిజం కాదని.

పదే పదే నిష్కారణంగా లెంపకాయలు కాసే పిలగానికీ అవి లేకపోవడం గొప్పగా అనిపిస్తుంది. అనవసరంగా లాఠీ దెబ్బలూ లాకప్ దోమకాట్లూ లేకపోవడం మెరుగని ఎందుకో సామాన్య ప్రజలకి అనిపిస్తుంది. రెండూ ఒకటే అని వాళ్లనుకోరు. రెండోదానిలోనే ఎక్కువ మోసముందని ప్రొఫెసర్లకి అనిపించినట్టుగా బాధితులకి అనిపించదు.

family

సోషలైజేషన్ స్థానాన్ని మింగేసిన పెంపకం

ప్రధానంగా ఇంటిపట్టున, కుటుంబంతో, బంధువుల మధ్య జరిగే పెంపకానికీ (upbringing), వీధుల్లో, స్నేహితులతో, టీచర్ల, పేరెంట్ల కనుసన్నల వెలుపల జరిగే సామాజికీకరణకీ (socialization) తేడా లేకుండా పోయినదీ సమయంలోనే. సోషలైజేషన్ స్థానాన్ని పెంపకం మింగేసింది ఈ దశలోనే. ఓవర్ పేరెంటింగు ఈ ఘట్టంలో ప్రముఖంగా కనిపించే లక్షణం. ఆ తర్వాత నిర్విరామ మీడియా పెంపకాన్నే స్థానభ్రంశం చేసింది.

(పిల్లలు సమర్ధులైన కుటుంబ సభ్యులుగా మారడం పెంపకం పని (దీనికి లోకంతో పెద్దగా పనిలేదు). ప్రయోజకులయిన, సమర్థులైన సమాజ సభ్యులుగా పౌరులుగా రూపొందడమే సామాజికులు కావడం. ఈ క్రమమే సామాజికీకరణ. ఇప్పుడున్న పరిస్థితుల తిరకాసేమంటే మొదటిదానిలో విజయం రెండోదానికి అడ్డంకి అవుతుంది.)

పిల్లలని ఏదో మిషతోనో మభ్యపెట్టో బలవంతంగా ఇంట్లో కట్టిపడేసినా, లేదూ వాళ్లే స్వచ్ఛందంగానే అవసరంలేనంత సమయం ఇంటిపట్టునే గడిపినా సరే, వారు నిమగ్నమయ్యేదేదీ తల్లిదండ్రుల చేతుల్లో లేకుండా పోయింది.

అతి కష్టమ్మీద, ఆర్ధికవనరులు సమకూడి, అందరూ అదే చేస్తుండటమనే సమాజపు తీరు కలిసొచ్చి, పిల్లల ఎదుగుదలని మెల్లగా వీధుల నుంచి మైదానాలనించి దోస్తులనుంచి, వారు సొంతగా చేసుకొనే ప్రయత్నాలనించి, ప్రయోగాల నుంచి తప్పించి, పెంపకాన్ని తల్లిదండ్రులు మమతానురాగాల పల్లకిగా అల్లుకుంటున్న రోజులలోనే వారికి కొత్త ముప్పులు ఒకదానివెనక మరొకటి వచ్చాయి. వారి సర్వాధిపత్యానికి, వారి నియంత్రణల సర్వవ్యాపకత్వానికి ఎసరు పెట్టాయి.

పోర్నో సమస్య దగ్గర పనిచేసిన పెద్దవాళ్ల టక్కులు, మాదక ద్రవ్యాలూ వీడియో గేముల వంటి వ్యసనాల దగ్గర పనిచేయలేదు. చూసీ చూడనట్టుండటం, పిల్లల సెక్సువాలిటీని చూసి తల్లిదండ్రులలో రేగే గుండెమంటలని గుట్టుగా ఆర్పేసుకోవడమనేది బూతు ఫిల్ముల విషయంలో పనిచేసినట్టు, ఈ కొత్త వినియోగాల, వ్యసనాల దగ్గర పనిచేయలేదు. చేయదు.

అన్ని అంశాలనీ సామాజిక విషయాలు నిర్ణయిస్తుండగా, శ్రీశ్రీ చెప్పిన ‘తెలియని ఏ తీవ్ర శక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు’ తీరా పర్యవసానాలకి మాత్రం తామే వ్యక్తిగతంగా పూచీ పడాల్సివస్తున్నది. తల్లిదండ్రులేమో సరైనరీతిలో దారిలో సంతానాన్ని పెంచనందుకు నిందమోయాలి. పిల్లల ఆరోగ్యమూ చదువులేమవుతాయో అనే బెంగతో నిస్సహాయంగా తలబాదుకోవాలి. వారి బాగూ భవిష్యత్తుల గురించిన అనిశ్చితితో వేగాలి. వ్యసనాలకి బానిసలయిన పిల్లలేమో తమ సమస్యకి వ్యక్తిగతంగా తామే బాధ్యత వహించవలసి వస్తుంది. మనోబలం కోల్పోవలసివస్తుంది లేదా క్రూరత్వానికి గురవ్వాల్సివుంటుంది.

పెంపకాన్ని నిర్మూలించాలి

ఖలీల్ జిబ్రానూ, కమ్యూనిస్టులూ దీనికి పరిష్కారం ఎంతోకాలం క్రితమే సూచించారు. పెంపకాన్ని మెరుగుదిద్దడం కాక దానిని నిర్మూలించాలని. గత మూడు నాలుగు దశాబ్దాలలో వారి సలహాకి సరిగ్గా వ్యతిరేకంగా లోకం నడిచింది. పిల్లలని వారి అమ్మనాన్నల ఆస్తిగా గుర్తించి, ఆ ఆస్తినెలా కాపాడుకోవాలి, ఎలా పెంపొందించుకోవాలనే ఆలోచన కరుడుగట్టిపోయింది. ఇక ఆ తర్వాత పెంపకాన్నేరూపుమాపి, సామాజికరణలో దాన్ని విలీనం చేయాలన్న ఆలోచన ఆ చట్రంలో పుట్టే అవకాశమే లేదు. అందులో ఇరుక్కున్న వాళ్లకిది అర్ధమే కాదు. మహా అయితే, ఉమ్మడి కుటుంబాలలో బంధుజనమందరి సమక్షంలో జరిగిన పెంపకమే గుర్తుకొస్తుంది. లేదా కొన్నిరకాల పేద కుటుంబాలలో పిల్లల పట్ల చూపే నిరాదరణయినా తలపుకొచ్చి గుండె జల్లుమంటుంది.

తల్లిదండ్రుల గుప్పిట్లోంచి పిల్లలని విడిపించి, లేదా తమను తాము విడిపించుకోనిచ్చి, వారి బారిన పడకుండా కన్నవాళ్ల ఇష్టాయిష్టాలకి అతీతంగా, సమిష్టిగా పెరగడమూ, చదువుకోవడమే దీనికి పరిష్కారం. లేదా మొత్తం సమాజమే నాగరికంగా వుండే ప్రాంతాలలో పిల్లలు ఇంటిపట్టున వుండి పెరిగి నాగరికంగా సమాజ సభ్యులవడం సాధ్యం కావచ్చు. ఆసియా ఖండంలాంటి బర్బర సంస్కృతిలో అతికొద్దిమందికే అదీ పరిమితంగా మాత్రమే అది సాధ్యమవుతుంది.

ఈ అలవాట్లూ ప్రలోభాలూ వ్యసనాలూ పిల్లలు సమాజం నుంచి, మీడియా నుంచి, సాటివాళ్ల నుంచి, స్కూళ్లలోనూ, ఆటల, సంచారాల మైదానాల నుంచీ, పార్టీల నుంచీ, దోస్తుల నుంచీ ఇతర సావాసాల నుంచీ, సరదాల నుంచీ నేర్చుకుంటున్నారు కనుక వాటిని నివారించుదాం, తగ్గించేద్దాం, వాటి మీద మరింత నిఘా పెడదాం, నియమాలు విధించుదాం అని తల్లిదండ్రులకీ వృత్తినీతివాదులకీ అనిపించడం సోమరితనమంత సహజం. కన్నవాళ్ల గుండెదడలంత అసంకల్పితం.

(ఈ నీతివాదులలో వామపక్ష కవులదే, స్త్రీవాద కార్యకర్తలదే, లేదా వీరినించే వచ్చే లేదా వీరిలా ఆ సమయానికి నటించే టీవీ న్యూస్ కాపీ రైటర్లదే ఇంకా చెక్కుచెదరని నాయకత్వం. వీరిని హిందూ నాజీలు స్థానభ్రంశం చేసినా పెద్దమార్పేమీ వుండదు.

ఈ రెండు రకాలకంటే సనాతన బ్రాహ్మణ సాంప్రదాయవాదం చాలా రకాలుగా మెరుగు. కాలం మారిపోతున్నదనీ వీలైనంత వరకూ పాత నియమాలని పట్టుకువేలాడదామనీ అది అనుకుంటుంది. ఏదేమైనా ఆ విలువలకి కాలం చెల్లిందనే సృహ ఇటీవల శతాబ్దాలలో దానిలో చేరి అదే ప్రధానమైపోయింది. మన ఆధునిక నీతివాదులు, భాష్యకారులు రానున్నయుగానికి వైతాళికులమనుకుంటారు కనుక, నిస్సంకోచంగా శాసనాలు చేసి పడేస్తారు. వీలైతే నిర్దాక్షిణ్యంగా బలవంతంగా వాటిని రుద్దిపారెయ్యగలరు.)

మరి పెంపకం సమస్యకి పరిష్కారం ఏమిటీ, అంటే సమకాలీన పితృస్వామ్య కేంద్ర వైరుధ్యానికి విరుగుడేమిటీ అనే ప్రశ్నకి, సమాధానం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థలో అదనపు విలువను కాజేయకుండా ఏలా ఆపాలనే యత్నంలాంటిది. లేదా కుటుంబంలోనో కులవ్యవస్థలోనో అసమానతలని రూపుమాపాలనుకోవడం లాంటిది. వాటిని నిర్మూలించడమే లేదా వాటిని డొల్లలుగా మార్చడమే మార్గం. వాటిని వదులుకోవాలి గానీ మెరుగుపరుచుకోవాలనుకోవడం వృధా ప్రయాస. దురాశ. అసంభవం.

డీప్రైవేటైజేషనే ప్రయత్నించాలి

ప్రైవేటీకరణ విఫలమైనప్పుడు డీప్రైవేటైజేషనే ప్రయత్నించాలి. ప్రభుత్వ హయాంలో నిర్వహణ సరిగా వుంటే అసలు ప్రైవేటీకరణ వచ్చేది కాదు కదా అనొచ్చు. అసలు పెంపకం ముందునుంచీ ప్రైవేటురంగంలోనే వుంది. దానిని సమాజపరం చేయడం, ప్రభుత్వరంగంలోకి మార్చడం, అంటే ఆ పనిని తల్లిదండ్రులకంటే మెరుగ్గా చేయగల నిపుణులకి అప్పజెప్పగలిగే లోపు ఏంచేయాలి?  అంటే సోషలిజం వచ్చేవరకూ ఉండే ఈ మధ్యంతర కాలంలో చేయగలిగిన పనేమంటే పెంపకం, సామాజికీకరణల నిష్పత్తిలో వంకరని సరిచేసుకోవడమే (reversing the skewed ratio of upbringing to socialization). సామాజికీకరణ ఎక్కువా, పెంపకం తక్కువా వుండేలా చూసుకోవడమే ఇప్పుడు చేయగలపని.

దీనర్ధం, ఒకరకంగా ముల్లును ముల్లుతోనే తీయాలనేలాంటిది. లాంటిది. అది కాదు. ఎక్కడైతే మాదక ద్రవ్యాలు పిల్లలని ప్రలోభపెడతాయో, అలాంటి చోట్లనే, సావాసాలతోనే, సందర్భాలలోనే, పిల్లలు కాలమంతా గడుపుతూ ఎదగడమే, పెరగడమే తక్కువ అగడ్తలూ అపాయాలున్న విరుగుడు. విడ్డూరంగా వున్నా ఇదొక్కటే లోతయిన పరిష్కారం.

లేదంటే సాంప్రదాయ బర్బరత్వంలోకి జారిపోవడమే దారి. కోదండాలూ, రూళ్ల కర్రలూ, గోడకుర్చీలూ, శొంటిపిక్కలూ, వాతలూ, స్తంభాలకీ చెట్లకీ పిల్లలని కట్టేసి కొట్టడాలూ, వేలాడేయడాలూ, నగుబాటు చేయడాలూ, గదుల్లో పెట్టి తాళాలేయడాలూ వంటి అనేక క్రూర విధానాలు మన చరిత్రలో, సంప్రదాయంలో, గ్రామసీమలలో ఉన్నాయి.

పిల్లల మీద, విద్యార్ధుల మీదా వాడడం మానేసి కిందికులస్తులపై పైకులాల వాళ్లు వేసే అమానుష శిక్షలని, మళ్లీ ఇళ్లలోకి, పిల్లల పెంపకంలోకి, విద్యారంగంలోనికి తిరిగి తెచ్చుకోవచ్చును. ఆ మోటు అమానవీయ ఆచారాల పునరుద్ధరణని ఇప్పడు పూర్తిగా నివారించగల లేదా అరికట్టగల దశ దాటిపోయామేమో.

ఈ నిర్దాక్షిణ్య మార్గాలలో మాదక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టవచ్చునేమో గానీ (అదీ అనుమానమే), పెంపకంలో మరిక ఇప్పటి కాలానికి న్యాయమనిపించే, నాగరికమనిపించే కనీస మానవత్వం, సహజత్వం, సున్నితత్వం మిగలవు. అలాటి దుర్బర నిర్బంధ పరిస్థితుల్లో పెరిగిన భావిపౌరులు నేటి తరంకంటే ఉత్తమంగా ఉన్నతంగా ఉండగలరనుకోలేం. జబ్బులకంటే మందులే ఎక్కువ హాని కలిగించే ఈ విషవలయంలోకి సమాజం చిక్కుకోకుండా వుండాలంటే ఏంచేయాలి? ఈ సామాజిక సంక్షోభానికి సామాజిక పరిష్కారమే వెతకాలి. ఐసోలేషనూ, సోషల్ డిస్టాన్సింగ్, లాక్డౌనులని పెంపకంలోంచి వీలైనంత తగ్గించాలి.

వీధుల్లోకీ దోస్తుల మధ్యకీ లోకంలోకీ వదలాలి

పిల్లలని తిరిగి వీధుల్లోకీ దోస్తుల మధ్యకీ లోకంలోకీ వదలాలి. తల్లిదండ్రులు తమ పాత్ర, జోక్యం, పర్యవేక్షణా తగ్గించుకోవాలి. చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రుల నివాసాలకి అప్పుడప్పుడూ నచ్చినప్పుడు మాత్రమే సందర్శిస్తుండే సమాజంలా మారే చర్యలు తీసుకోవాలి. ఇదంతా ఇల్లు అనే ప్రత్యేక సౌకర్యాన్ని కోల్పోవడం వదులుకోవడంగా జరిగితే అది మంచి మార్పు కాబోదు. ఇంటిని వదిలించుకోవడం, తల్లిదండ్రులని తప్పించుకోవడమై వుండాలి ఆ అవకాశం. అలా జరగాలంటే, ఇంటికీ తల్లిదండ్రులకీ దూరంగా పిల్లలు పెరిగే ప్రాంతాలు, పరిస్థితులు, తరగతులు, పాఠశాలలు, వసతి గృహాలు, సెలవులు, శిక్షణా, పర్యవేక్షణా, జీవన ప్రమాణాలు వగైరాలు ఇంటికంటే ఎక్కువ సౌకర్యంగా సౌఖ్యంగా భద్రంగా మరింత స్వేచ్ఛగా ఉండితీరాలి. ఆ పనిని, వ్యయాన్ని మొత్తం సమాజం (వారి తరుపున ప్రభుత్వం) చేపట్టాలి. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ రుసుము వసూలు చేయకూడదు.

లేదంటే, తల్లిదండ్రులనే పీడనని, ఇల్లనే పీడని వదిలించుకోవడం కూడా ఒక అపురూపమైన సరుకు అయిపోయి అది కొందరికే లభించి అసలుకే ఎసరు తెస్తుంది. ఇప్పుడు జరిగేదదే. ఇవన్నీ జరిగినప్పుడే తల్లిదండ్రులనే పీడ పిల్లలకీ, పిల్లలనే యాతన తల్లిదండ్రులకీ తప్పుతుంది. ఇది పరస్పర విముక్తి.

మనసులు మార్చుకోవడం దీనిలో మొదటి దశ. అదే అతికష్టం ఈ విషయంలో. కమ్యూనిజం కుటుంబాన్ని రద్దుచేయమంటుందన్న మాట చాలామంది కమ్యూనిస్టులకే దిగ్భ్రాంతి కలిగిస్తుంది. నమ్మలేరు. ఏరకంగా చూసినా అది సబబనిపించదు వాళ్లకి. కమ్యూనిజం కోసం ప్రాణాలర్పించడానికి మాత్రం తయారు.

పిల్లలు తల్లిదండ్రుల ఆస్తిగా, అందునా తమ కనుసన్నల్లో పడివుండే ఆస్తిగావుండే దుస్థితిని మార్చకుండానే, ఇంటిలోనే పిల్లలు పెరిగి పెద్దవడమనే దురాచారాన్ని రూపుమాపకుండానే, పితృస్వామ్యాన్ని కూల్చేద్దామనుకునే వెర్రి వూహల నించి బయటపడటం దీనికి కావాలి.

ఈ మాదకద్రవ్య మహమ్మారి ఈ కాలం పిల్లల పరాయీకరణ ఫలితమో కాదో గానీ వారి పెంపకపు ప్రైవేటీకరణ మీద వేటువేయకుండా పరిష్కారం వైపు అడుగులేయలేం.

(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe