దిల్లీ రాజకీయాల్లో దత్తాత్రేయ, తమిళిసై పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి?

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం పేరు జాతీయ స్థాయిలో చర్చకొస్తోంది. తెలంగాణకు చెందిన నేత కానీ, తెలంగాణ రాజకీయాలతో సంబంధం ఉన్న ఇతర రాష్ట్రాల నేత కానీ ఈసారి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవి రేసులో ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా రాష్ట్రపతి పదవి తెలంగాణకు దక్కుతుందన్న ప్రచారం ఒకటి జాతీయ స్థాయిలో జరుగుతోంది. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

మొన్నమొన్నటి వరకు పార్లమెంటులో ప్రతి బిల్లు విషయంలో బీజేపీకి అనుకూలంగా ఉంటూ వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. పైగా ఆయన పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ పనిచేస్తున్నారు.

మోదీ, అమిత్ షాలంటే బుసలు కొట్టే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ కేంద్రంగా ఒక కూటమి ఏర్పాటు చేసే దిశగా భారీ కసరత్తే చేస్తున్నారు. అదే జరిగితే అందులో చేరేందుకు కేసీఆర్‌ను కూడా ప్రశాంత్ కిశోర్ ఒప్పించడం ఖాయం. అప్పుడు తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లను రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ కోల్పోతుంది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ నేతకు దేశాధ్యక్ష పదవి కట్టబెట్టాలన్న ఆలోచన ఒకటి బీజేపీ అధిష్ఠానంలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హరియాణా గవర్నరుగా ఉన్న బండారు దత్తాత్రేయను బీజేపీ రాష్ట్రపతి చేయాలనుకుంటున్నట్లుగా ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

అదే జరిగితే తొలిసారి తెలంగాణవాసి దేశ అత్యున్నత పదవికి పోటీ పడుతున్నందున బీజేపీతో విభేదాలను పక్కన పెట్టి కేసీఆర్ కచ్చితంగా ఆయనకు మద్దతివ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ప్రస్తుతం బీజేపీ ఇదే వ్యూహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి చికిత్స కోసం రావడం కూడా ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. ఆయన దత్తాత్రేయకు మద్దతు కూడగట్టే పనిపైనే విశాఖకు వచ్చి ఏపీ సీఎం జగన్‌ను కలిశారని, ఏపీలో పాలక పార్టీ వైసీపీ మద్దతు కూడగట్టేందుకు ఖట్టర్ విశాఖ వచ్చారని రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.

కేంద్రంలోని బీజేపీ పెద్దలు కానీ, ఏపీ వ్యవహారాలతో సంబంధం ఉన్న బీజేపీ నేతలు కానీ కాకుండా ఏ మాత్రం సంబంధం లేని ఖట్టర్‌ని అందుకే పంపించారని తెలుస్తోంది.

రాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలో ఇలా ఉండగా ఉప రాష్ట్రపతి విషయంలోనూ తెలంగాణ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ గవర్నరుగా ఉన్న తమిళిసై సౌందరరాజన్ ఉప రాష్ట్రపతి పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి.

ఇటీవల ఆమె దిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలవడం కేసీఆర్‌పై ఫిర్యాదుల కోసం మాత్రమే కాదని, ఉప రాష్ట్రపతి పదవికి తన పేరు పరిశీలించమని కోరేందుకు కూడా అని వినిపిస్తోంది.

వీరితో పాటు మరికొన్ని పేర్లూ వినిపిస్తున్నాయి. ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరు కూడా రాష్ట్రపతి పదవికి వినిపిస్తోంది. ఒడిశాకు చెందిన ఈ గిరిజన మహిళా నేత సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ గవర్నరుగా ఉన్న గిరిజన నేత అనసూయ ఉయికీ పేరు, కేరళ గవర్నరు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పేర్లూ రాష్ట్రపతి పదవికి విపిస్తున్నాయి.

అలాగే, ప్రస్తుతం కర్ణాటక గవర్నరుగా ఉన్న దళిత నేత థావర్ చంద్ గహ్లోత్ పేరు కూడా రాష్ట్రపతి పదవికి వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవి విషయానికొస్తే ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరో కేంద్ర మంత్రి అర్జున్ ముండా పేరు వినిపిస్తోంది. రాజ్‌నాథ్ ఠాకూర్ వర్గానికి చెందినవారు కాగా అర్జున్ ముండా గిరిజన నేత.

తాజా కథనాలు...

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe